LOADING...
Slovakia: ఉక్రెయిన్‌కు స్లొవేకియా షాక్‌.. అత్యవసర విద్యుత్‌ సరఫరా నిలిపివేత
ఉక్రెయిన్‌కు స్లొవేకియా షాక్‌.. అత్యవసర విద్యుత్‌ సరఫరా నిలిపివేత

Slovakia: ఉక్రెయిన్‌కు స్లొవేకియా షాక్‌.. అత్యవసర విద్యుత్‌ సరఫరా నిలిపివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2026
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా, ఉక్రెయిన్‌లోని విద్యుత్‌ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన దాడులు కొనసాగిస్తున్న వేళ కీవ్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌కు అత్యవసర విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్లొవేకియా ప్రకటించింది. తమ దేశానికి రష్యా నుంచి వచ్చే చమురు సరఫరాను కీవ్‌ అడ్డుకోవడమే ఈ వివాదానికి కారణమైందని సమాచారం. ఉక్రెయిన్‌ భూభాగం గుండా వెళ్లే డ్రుజ్బా పైప్‌లైన్‌ ద్వారా మధ్య ఐరోపా దేశాలకు రష్యా ముడి చమురు చేరుతోంది. అయితే జనవరి 27నుంచి స్లొవేకియా,హంగేరి దేశాలకు చమురు సరఫరా నిలిచిపోయింది. రష్యా నిర్వహించిన డ్రోన్‌ దాడుల కారణంగా డ్రుజ్బా పైప్‌లైన్‌ దెబ్బతిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అయితే పైప్‌లైన్‌కు ఎలాంటి నష్టం కలగలేదని,ఉద్దేశపూర్వకంగానే కీవ్‌ చమురు సరఫరాను ఆపిందని స్లొవేకియా ఆరోపిస్తోంది.

వివరాలు 

రష్యా చమురు సరఫరాను కీవ్‌ పునరుద్ధరించే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది 

పరిస్థితిని పరిశీలించేందుకు తమ రాయబారిని పంపేందుకు అనుమతి ఇవ్వడం లేదని కూడా పేర్కొంది. ఈ అంశంపై చర్చించేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ (Volodymyr Zelensky) ముందుకు రావడం లేదని తెలిపింది. దీంతో ప్రతీకార చర్యలకు దిగామని స్లొవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికో (Robert Fico) వెల్లడించారు. ఉక్రెయిన్‌కు అందిస్తున్న అత్యవసర విద్యుత్‌ సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రష్యా చమురు సరఫరాను కీవ్‌ పునరుద్ధరించే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

వివరాలు 

రెండు దేశాలు సహనం పాటించి బాధ్యతతో వ్యవహరించాలని కోరిన ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి

చమురు రవాణా తిరిగి ప్రారంభం కాకపోతే పరిణామాలు మరింత తీవ్రమవుతాయని ఫికో హెచ్చరించారు. యూరోపియన్‌ యూనియన్‌లో సభ్యత్వం కోసం కీవ్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఇకపై మద్దతు ఇవ్వబోమని తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌లో భాగమైన స్లొవేకియా, హంగరీ దేశాలు రష్యాకు అనుకూల వైఖరి కలిగి ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాలపై ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి స్పందిస్తూ, ఆ రెండు దేశాలు సహనం పాటించి బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

Advertisement