Australia: ఆస్ట్రేలియా విమానాశ్రయ హ్యాంగర్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో తీవ్రమైన విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 11 మందికి గాయాలు అయ్యాయి. ఉత్తర ప్రాంతంలోని పారాఫీల్డ్ విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ సమయంలో ఓ చిన్న విమానం అదుపుతప్పి నేరుగా విమానాలను నిలిపి ఉంచే గోదామును బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చెలరేగి, నల్లటి దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేశాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వివరాలు
ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయిన విమానం
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం, కింగ్స్ రోడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కిందకు దిగే క్రమంలో విమానం నియంత్రణ కోల్పోయి గోదామును ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా సమీప ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వివరాలు
విమానాశ్రయం మూసివేత.. కార్యకలాపాలు నిలిపివేత
ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, ఐదుకిపైగా అగ్నిమాపక వాహనాలు, అత్యవసర సేవల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని స్థానిక ప్రత్యక్ష సాక్షి బెన్ తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అత్యవసర సేవలకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నామని విమానాశ్రయ యాజమాన్యం వెల్లడించింది.