Loading...
UAE's top honour: స్మిత్‌ మచ్ఛర్‌కు యూఏఈ గౌరవం.. గతంలో ఈ పురస్కారం అందుకున్న ఇద్దరు వీరే..
స్మిత్‌ మచ్ఛర్‌కు యూఏఈ గౌరవం.. గతంలో ఈ పురస్కారం అందుకున్న ఇద్దరు వీరే..

UAE's top honour: స్మిత్‌ మచ్ఛర్‌కు యూఏఈ గౌరవం.. గతంలో ఈ పురస్కారం అందుకున్న ఇద్దరు వీరే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమానంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన భారత పైలట్‌ స్మిత్ మచ్చర్‌కు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. అక్టోబర్‌ 27న ఆయనకు ఫస్ట్‌ క్లాస్‌ ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌ II పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని అందుకున్న భారతీయుల్లో స్మిత్‌ మచ్ఛర్‌ మూడో వ్యక్తి. ఇంతకుముందు భారత మాజీ రాయబారులు నవదీప్‌ సింగ్‌ సూరి,సంజయ్‌ సుధీర్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానం 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఒమన్‌కు చెందిన సహ పైలట్‌ హమామ్‌ అల్‌ హమ్మామీ.. కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌పై దాడి చేశాడు.

వివరాలు 

తీవ్ర గాయాలైనా.. సమయస్ఫూర్తితో విమానాన్ని కాపాడిన పైలట్

కాక్‌పిట్‌లో ఉపయోగించే అత్యవసర గొడ్డలితో దాడి చేయడంతో మచ్ఛర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

విమానం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయినట్లు కథనాలు వెల్లడించాయి.

తీవ్ర గాయాలై, రక్తస్రావం అవుతున్నప్పటికీ మచ్ఛర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించారు.

విమానంలో అత్యవసర పరిస్థితిని సూచించే 7700, హైజాకింగ్‌ను సూచించే 7500 కోడ్‌లను ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు పంపించారు.

అనంతరం కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో ఇతర సిబ్బంది, ప్రయాణికులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు వీలైంది.

విమాన సిబ్బంది తిరిగి నియంత్రణ సాధించడంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని వాయవ్య ప్రాంతంలో ఉన్న తబూక్‌కు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా దిగింది.

వివరాలు 

పైలట్‌ ధైర్యానికి యూఏఈ అధ్యక్షుడి ప్రశంసలు

ఈ ఘటనలో చూపిన ధైర్యం, వృత్తి నైపుణ్యానికి గుర్తింపుగా యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌.. మచ్ఛర్‌తో పాటు ఇతర ఫ్లైదుబాయ్‌ సిబ్బందికి పురస్కారాలు అందించారు.

దుబాయ్‌ యువరాజు షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ఈ అవార్డులను ప్రదానం చేశారు.

కార్యక్రమంలో మచ్ఛర్‌ చేతికి కట్టుతో ఉండటాన్ని గమనించిన యూఏఈ అధ్యక్షుడు.. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందని అడిగారు.

మరో రెండు నెలలు పట్టవచ్చని మచ్ఛర్‌ సమాధానమిచ్చారు.

కోలుకున్న తర్వాత తనతో కలిసి పోరాట శిక్షణ తీసుకోవాలని అధ్యక్షుడు సరదాగా సూచించారు.

యూఏఈ తమకు మరో ఇల్లులాంటిదని, విమాన సిబ్బంది తమ కుటుంబ సభ్యులేనని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

యూఏఈ పురస్కారం అందుకున్న మరో ఇద్దరు భారతీయులు

నవదీప్‌ సింగ్‌ సూరి: 2016 డిసెంబర్‌ నుంచి 2019 సెప్టెంబర్‌ వరకు యూఏఈలో భారత రాయబారిగా పనిచేశారు.భారత్‌-యూఏఈ సంబంధాలు,సహకారాన్ని బలోపేతం చేసినందుకు 2019లో ఈ పురస్కారం అందుకున్నారు.

సంజయ్‌ సుధీర్‌: 2021 నవంబర్‌ నుంచి 2025 సెప్టెంబర్‌ వరకు భారత రాయబారిగా పనిచేశారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని,ముఖ్యంగా ఆర్థిక,విద్యా రంగాల్లో సహకారాన్ని పెంపొందించినందుకు 2025లో ఈ గౌరవం పొందారు.

ఫస్ట్‌ క్లాస్‌ ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌ II అనేది విదేశీ దౌత్యవేత్తలు,ఉన్నతాధికారులు,అంతర్జాతీయ ప్రముఖులకు అందించే ఉన్నత పౌరపురస్కారం.

అయితే ఇది యూఏఈ అత్యున్నత పౌర పురస్కారమైన'ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌'కు భిన్నమైనది.

భారత ప్రధాని నరేంద్ర మోదీకి భారత్‌-యూఏఈ సంబంధాలను బలోపేతం చేసినందుకు 2019 ఆగస్టులో ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌ పురస్కారం లభించింది.

ADVERTISEMENT