vetting: నేటి నుంచి H-1B US వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించనున్న అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్1బీ,హెచ్4 వీసాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ప్రభుత్వం పరిశీలించనున్నది. ఈ ప్రక్రియ సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఈ నెల 15వ తేదీ నుంచి వీసా దరఖాస్తుదారుల ఆన్‌లైన్ కార్యకలాపాలపై సమీక్ష ప్రారంభమవుతుందని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వెట్టింగ్ సులభంగా జరిగేందుకు హెచ్1బీ, హెచ్4తో పాటు ఎఫ్, ఎం, జే వీసాలకు దరఖాస్తు చేసే వారందరూ తమ సోషల్ మీడియా ఖాతాల సెట్టింగ్‌లను ప్రైవేట్ నుంచి పబ్లిక్‌గా మార్చుకోవాలని సూచించింది. ఎఫ్, ఎం, జే వీసాలకు ప్రధానంగా విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు దరఖాస్తు చేస్తారు. కొత్త నిబంధనల అమలుతో ఇప్పటికే హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను అధికారులు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
వివరాలు
వీసాల జారీ విషయంలో అమెరికా ప్రభుత్వం అత్యంత అప్రమత్తం
ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రతి వీసా దరఖాస్తుదారుని పూర్తిస్థాయిలో వెట్టింగ్ చేస్తామని, వారి ఆన్‌లైన్ ఉనికిని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తామని తెలిపింది. ప్రతి వీసా నిర్ణయం జాతీయ భద్రత అంశాన్ని దృష్టిలో పెట్టుకునే తీసుకుంటామని పేర్కొంది. వీసాల జారీ విషయంలో అమెరికా ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుందని తెలిపింది. అమెరికాలోకి వచ్చే వారు అమెరికన్ పౌరులకు ఎలాంటి హాని చేయరని, దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించరని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అందుకే వీసా కోరే ప్రతి అభ్యర్థి తన విశ్వసనీయతను స్పష్టంగా నిరూపించుకోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.