South Korea: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌కు మరో 30 ఏళ్ల జైలు.. డ్రోన్ వ్యవహారంలో కోర్టు తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యేల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే దేశంలో మార్షల్ లా అమలు చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆయనకు,ఉత్తర కొరియాలోకి డ్రోన్లు పంపిన వ్యవహారంలో మరో 30ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ దక్షిణ కొరియా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2024 అక్టోబర్‌లో ఉత్తర కొరియా భూభాగంలోకి డ్రోన్లను పంపాలని యూన్ ఆదేశించినట్లు విచారణలో తేలిందని కోర్టు పేర్కొంది. ఉత్తర కొరియా సైన్యాన్ని రెచ్చగొట్టి అత్యవసర పరిస్థితిని సృష్టించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు న్యాయస్థానం అభిప్రాయపడింది. మార్షల్ లా అమలు విఫలమైన తర్వాత రాజకీయంగా తన చర్యలను సమర్థించుకునేందుకు ఓ సాకును సృష్టించాలనే లక్ష్యంతో ఈప్రణాళిక అమలు చేసినట్లు వెల్లడించింది.
వివరాలు
యూన్‌తో పాటు మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్ధారించింది
చట్టవిరుద్ధంగా పార్లమెంటుపై ఆధిపత్యం చెలాయించడం, రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయడం, అనియంత్రిత అధికారాలను వినియోగించుకోవడం కోసం మార్షల్ లాను ఆయుధంగా ఉపయోగించేందుకు యూన్ ప్రయత్నించారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో యూన్‌తో పాటు మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్, డిఫెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ కమాండ్ మాజీ అధిపతి యో ఇన్ హ్యూంగ్, డ్రోన్ ఆపరేషన్స్ కమాండ్ మాజీ అధిపతి కిమ్ యోంగ్-డేలను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. అత్యవసర పరిస్థితిని సృష్టించేందుకు ఉత్తర కొరియాను రెచ్చగొట్టే ప్రయత్నంలో సైనిక చర్యలను ముసుగుగా ఉపయోగించినట్లు పేర్కొంటూ వారికి కూడా జైలు శిక్షలు విధించింది.
వివరాలు
యూన్ తరఫు న్యాయవాదులు కోర్టులో భిన్న వాదనలు
అయితే యూన్ తరఫు న్యాయవాదులు కోర్టులో భిన్న వాదనలు వినిపించారు. ఉత్తర కొరియా తమ దేశంపై చెత్త బెలూన్లను పంపించి ఉద్రిక్తతలు సృష్టించడానికి ప్రయత్నించిందని,దానికి తగిన సమాధానంగా మాత్రమే డ్రోన్లను ఆ దేశంలోకి పంపినట్లు వారు వివరించారు. కాగా,2024 డిసెంబరులో ప్రతిపక్ష పార్టీలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ అప్పటి అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ దేశంలో మార్షల్ లా ప్రకటించారు.
వివరాలు
యూన్‌పై అభిశంసన ప్రక్రియ
దేశ భద్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ, దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల తర్వాత యూన్‌పై అభిశంసన ప్రక్రియ చేపట్టగా, ఆయన అధ్యక్ష పదవిని కోల్పోయారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయనకు డ్రోన్ కేసులో మరో 30 ఏళ్ల జైలు శిక్ష పడటంతో దక్షిణ కొరియా రాజకీయాల్లో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.