LOADING...
UK: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్రిటన్ కఠిన నిర్ణయం.. త్వరలో కొత్త చట్టం!
త్వరలో కొత్త చట్టం!

UK: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్రిటన్ కఠిన నిర్ణయం.. త్వరలో కొత్త చట్టం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించకుండా చట్టం తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. పిల్లల శారీరక,మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాతో పాటు గేమింగ్,లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగంపై కూడా పరిమితులు విధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చిన్నారులు గంటల తరబడి మొబైల్ ఫోన్లు,ఇతర డిజిటల్ స్క్రీన్‌ల ముందు గడపడం వల్ల ఆరోగ్య సమస్యలు,మానసిక ఒత్తిడి,ప్రవర్తనలో మార్పులు వంటి ఇబ్బందులు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

వివరాలు 

టెక్నాలజీ సంస్థలపై కఠిన మార్గదర్శకాలు అమలు

పిల్లల భద్రత,వారి ఆనందకరమైన బాల్యానికి ఎలాంటి రాజీ ఉండదని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని టెక్నాలజీ కంపెనీలు వ్యతిరేకించినా వెనక్కి తగ్గబోనని హెచ్చరించారు. ఈ ప్రతిపాదిత నిషేధంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించిన అనంతరం జులైలో చట్టం తీసుకురానున్నట్లు ప్రధాని వెల్లడించారు. యూట్యూబ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, రోబ్లాక్స్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలకు ఈ నిబంధనలు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం టెక్నాలజీ సంస్థలపై కఠిన మార్గదర్శకాలు అమలు చేస్తోంది.

వివరాలు 

ఏజ్ వెరిఫికేషన్ విధానం తప్పనిసరి

పిల్లలు సోషల్ మీడియా యాప్‌లను సులభంగా ఉపయోగించకుండా వయస్సు నిర్ధారణ (ఏజ్ వెరిఫికేషన్) విధానాన్ని తప్పనిసరి చేసింది. అలాగే చిన్నారులకు హానికరమైన కంటెంట్ చేరకుండా ఉండేందుకు తమ అల్గారిథమ్‌లలో మార్పులు చేయాలని టెక్ కంపెనీలకు సూచించింది. కాగా, 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు విధించిన దేశాల జాబితాలో ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో బ్రిటన్ కూడా కఠిన చట్టం తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చేసిన ట్వీట్ 

Advertisement