LOADING...
Immigration: అమెరికాలో వలసలకు  పదేళ్లపాటు  బ్రేక్‌ ఇవ్వాలి: ట్రంప్‌ మాజీ సలహాదారు స్టీవ్ బానన్
ట్రంప్‌ మాజీ సలహాదారు స్టీవ్ బానన్

Immigration: అమెరికాలో వలసలకు  పదేళ్లపాటు  బ్రేక్‌ ఇవ్వాలి: ట్రంప్‌ మాజీ సలహాదారు స్టీవ్ బానన్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2025
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో వలస విధానాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్ల పాటు అమెరికాకు వలసలను పూర్తిగా నిలిపివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఇమిగ్రేషన్ వ్యవస్థలో తీవ్ర అవినీతి పేరుకుపోయిందని విమర్శించారు. శరణార్థులు, క్షమాభిక్ష, ఆశ్రయం కల్పించే పథకాలు పూర్తిగా అవినీతితో నిండిపోయాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తన 'వార్‌రూమ్' కార్యక్రమంలో బానన్ వెల్లడించారు. హెచ్‌-1బీ వీసా పథకం ద్వారా అమెరికన్ యువతకు అవకాశాలు తగ్గిపోతున్నాయని, తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ కార్మికులతో కంపెనీలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయని ఆయన తెలిపారు.

వివరాలు 

లక్ష డాలర్లకు హెచ్-1బీ వీసా ఫీజు

ఇదిలా ఉండగా, వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న ట్రంప్ ప్రభుత్వం శరణార్థులు, వలసదారులకు మంజూరు చేసే వర్క్ పర్మిట్‌ల గడువును తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అమెరికా తీసుకువస్తున్న తాజా విధానాల కారణంగా హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసా అపాయింట్‌మెంట్లు వాయిదా పడటంతో వచ్చే ఏడాది అక్టోబర్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదనంగా, హెచ్-1బీ వీసా ఫీజును అమెరికా ప్రభుత్వం లక్ష డాలర్లకు పెంచింది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం విధానాలను సరిచేయాల్సిన అవసరం ఉందంటూ బానన్ వ్యాఖ్యానించారు.

Advertisement