Jaishankar to Araghchi: వాణిజ్య నౌకలపై దాడులు ఆపండి.. ఇరాన్‌కు భారత్ కీలక విజ్ఞప్తి!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల్లో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై తన తీవ్ర ఆందోళనను జైశంకర్ వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాణిజ్య నౌకలు, నావికులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇరాన్‌ను కోరారు.
వివరాలు
భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదు
ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను. వాణిజ్య నౌకలు, నావికుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడాలని విజ్ఞప్తి చేశాను.
ఇటువంటి దాడులను ఏ పక్షం చేసినా భారత్ ఖండిస్తుందని జైశంకర్ తన 'ఎక్స్' ఖాతాలో వెల్లడించారు.
అలాగే ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, కొనసాగుతున్న చర్చలకు సంబంధించిన వివరాలను ఇరాన్ తమతో పంచుకుందని తెలిపారు.
సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు, దౌత్య మార్గానికే భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు.