
Bangladesh: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. దేశం విడిచివెళ్లిపోయిన మాజీ అధ్యక్షుడు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలో ఉన్న అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, ఆ పార్టీకి చెందిన నాయకులు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే షేక్ హసీనా భారత్‌లో తలా దాచుకుంటున్న విషయం తెలిసినదే. మిగతా నేతలు తాత్కాలిక ప్రభుత్వ హయాంలో పలు క్రిమినల్ కేసుల్లో చిక్కుకుపోయారు.
ఈ పరిణామాల మధ్య, బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ దేశం వదిలి వెళ్లిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి.
సమాచారం ప్రకారం, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయన థాయిలాండ్‌కు వెళ్ళే విమానాన్ని ఎక్కినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విచారణ ప్రారంభించింది.
వివరాలు
హమీద్‌పై హత్య ఆరోపణలతో కేసు నమోదు
అవామీ లీగ్‌కు చెందిన విద్యార్థి విభాగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన హమీద్ మొదట్లో ఎంపీగా ఎన్నికయ్యారు.
2013 నుంచి 2023 వరకు షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన రెండు సార్లు బంగ్లాదేశ్ అధ్యక్ష పదవిని స్వీకరించారు.
గతేడాది ఆగస్టులో విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత నోబెల్ బహుమతిని పొందిన ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
అనంతరం అవామీ లీగ్ హయాంలో జరిగిన దాడులు, హత్యల ఆరోపణలపై విచారణ మొదలైంది. ఈ క్రమంలోనే 2025 జనవరిలో హమీద్‌పై హత్య ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
వివరాలు
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లుంగీలో..
ఆపై హమీద్ జాడ తెలియకపోయిన పరిస్థితుల్లో, గతవారం ఆయన ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అతనితో పాటు ఆయన సోదరుడు,బావ కూడా ఉన్నట్లు సమాచారం.విమానాశ్రయంలో హమీద్‌కి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు బయటకు వచ్చాయి.
అందులో ఆయన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లుంగీలో కనిపించారు.
ఈ ఘటనపై తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విచారణ నిమిత్తం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
వివరాలు
అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధిస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఇప్పటికే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేయగా, మరికొంతమందిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
కాగా, హమీద్ థాయ్‌లాండ్‌కి వైద్య చికిత్స కోసం వెళ్లినట్లు ఆయన కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు.
కానీ, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆయన విచారణ నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే దేశం విడిచి పారిపోయారని ఆరోపిస్తున్నారు.
ఇక మరోవైపు, బంగ్లాదేశ్ ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీపై సోమవారం అధికారికంగా నిషేధం విధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
అవామీ లీగ్ పార్టీ, దానికి చెందిన నాయకులపై ప్రత్యేక ట్రైబ్యునల్ విచారణ పూర్తయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.