Strait of Hormuz: అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే హర్మూజ్ జలసంధి మూసివేత
ఈ వార్తాకథనం ఏంటి
హార్ముజ్ జలసంధి అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలకు మాత్రమే ఈ జలసంధిని మూసివేశామని, ఇతర దేశాల నౌకలు మాత్రం స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే భద్రతా కారణాల వల్ల అనేక దేశాలు తమ నౌకలను ఈ మార్గంలో పంపేందుకు ముందుకు రావడం లేదని చెప్పారు. దీనికి ఇరాన్‌కు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి ద్వారా అనేక చమురు ట్యాంకర్లు, నౌకలు సాధారణంగానే ప్రయాణిస్తున్నాయని పేర్కొన్నారు.
Details
మొజ్తాబాకు ఎలాంటి సమస్య లేదు
హర్మూజ్ ప్రాంతంలో ఏర్పడిన కృత్రిమ అడ్డంకుల వల్ల చైనా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, త్వరలో ఆ దేశాలు తమ యుద్ధ నౌకలను ఈ ప్రాంతానికి పంపనున్నాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీగాయపడ్డారని అమెరికా చేస్తున్న ఆరోపణలపైనా ఆయన స్పందించారు. మొజ్తాబాకు ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఆయన తన విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. తమ దేశం బలంగా ఉందని, ఒక్క వ్యక్తిపై ఆధారపడి ఉండదని కూడా చెప్పారు.
Details
వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి
ఒకవేళ కీలక వ్యక్తులకు ప్రాణనష్టం సంభవించినా దేశం ఆ పరిస్థితిని తట్టుకోగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా గత నెలలో జెనీవాలో జరిగిన చర్చల సమయంలో అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్పై తాను గట్టిగా అరిచానని, ఇరాన్ వద్ద 11 అణుబాంబులకు సరిపడా యురేనియం ఉందని బెదిరించానని వచ్చిన ఆరోపణలను కూడా అరాగ్చీ ఖండించారు. వారు తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. చర్చలకు సంబంధించిన అసలు వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.