Hormuz: హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలు.. సముద్ర జీవవైవిధ్యానికి భారీ ముప్పు
ఈ వార్తాకథనం ఏంటి
హర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ సముద్ర జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని సముద్ర జీవశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి ఈ కీలక సముద్ర మార్గం మూసివేయబడటంతో గల్ఫ్ ప్రాంతంలో 1,500కు పైగా వాణిజ్య నౌకలు నెలల తరబడి నిలిచిపోయాయి. ఈ నౌకలు మళ్లీ ప్రయాణం ప్రారంభించినప్పుడు వాటి ద్వారా ఆక్రమణ జాతులకు చెందిన సముద్ర జీవులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.
వివరాలు
ఓడరేవుల్లో నౌకలు ఒకటి నుంచి మూడు రోజులకే పరిమితమవుతాయి
అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ మారియో టాంబుర్రీ నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
సాధారణంగా నౌకలు ఓడరేవుల్లో ఒకటి నుంచి మూడు రోజులకే పరిమితమవుతాయి.
దీంతో వాటి అడుగు భాగంలో సముద్ర జీవులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉండదు.
అయితే హోర్ముజ్ ప్రాంతంలో చిక్కుకున్న నౌకలు నెలల తరబడి కదలకుండా ఉండటంతో వాటి అడుగు భాగాలపై సూక్ష్మజీవులు, ఆల్గీ, బార్నాకిల్స్, మస్సెల్స్, ఇతర అకశేరుక జీవులు పెద్దఎత్తున పేరుకుపోయాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
వివరాలు
చేపల పరిశ్రమకు భారీ నష్టం
వాణిజ్య రవాణా తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ నౌకలు ప్రపంచంలోని వివిధ నౌకాశ్రయాలకు చేరుకుంటే, వాటితో పాటు ఈ జీవులు కూడా కొత్త ప్రాంతాలకు చేరే అవకాశం ఉందన్నారు.
అక్కడి స్థానిక సముద్ర జీవులతో పోటీ పడటం, వాటి నివాసాలను ఆక్రమించడం, వ్యాధులను వ్యాప్తి చేయడం, సముద్ర పర్యావరణ సమతుల్యతను శాశ్వతంగా దెబ్బతీయడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని హెచ్చరించారు.
ఇలాంటి ఆక్రమణ జాతులు చేపల పరిశ్రమకు భారీ నష్టం కలిగించడమే కాకుండా విద్యుత్ కేంద్రాల శీతలీకరణ వ్యవస్థలను దెబ్బతీసే ప్రమాదం ఉందని, వీటి నియంత్రణ కోసం ప్రతి ఏడాది కోట్లాది డాలర్ల వ్యయం చేయాల్సి వస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
వివరాలు
గల్ఫ్ ప్రాంతం విదేశీ సముద్ర జీవుల ప్రవేశానికి ప్రధాన కేంద్రంగా మారింది
గల్ఫ్ ప్రాంతం ఇప్పటికే విదేశీ సముద్ర జీవుల ప్రవేశానికి ప్రధాన కేంద్రంగా మారిందని గత అధ్యయనాలు వెల్లడించాయి.
ఇక్కడి అధిక ఉష్ణోగ్రతలు,అధిక ఉప్పుదనం వంటి కఠిన పరిస్థితులకు అలవాటు పడిన జీవులు ఇతర ప్రాంతాల్లో కూడా సులభంగా మనుగడ సాగించే సామర్థ్యం కలిగి ఉంటాయని ప్రొఫెసర్ టాంబుర్రీ వివరించారు.
అందువల్ల భారతదేశం,సింగపూర్ వంటి సమాన వాతావరణం ఉన్న నౌకాశ్రయాలు ప్రత్యేక అప్రమత్తత అవసరమని సూచించారు.
నెలలుగా నిలిచిపోయిన ఈ నౌకల నుంచి ఇప్పటికే లక్షల నుంచి కోట్ల సంఖ్యలో లార్వాలు గల్ఫ్ సముద్ర జలాల్లోకి విడుదలై ఉండవచ్చని అధ్యయనం పేర్కొంది.
వివరాలు
ఈ సమస్యను కూడా ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలి: ప్రొఫెసర్ టాంబుర్రీ
అలాగే నౌకల్లోని బ్యాలస్ట్ వాటర్,అడుగు భాగంలో ఏర్పడిన జీవ పొరల ద్వారా పరాన్నజీవులు, వ్యాధికారక సూక్ష్మజీవులు కూడా ప్రపంచ నౌకాశ్రయాలకు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపింది.
ఈ పరిస్థితిని నివారించేందుకు గల్ఫ్ నుంచి బయలుదేరే ముందు నౌకలను పూర్తిగా తనిఖీ చేసి శుభ్రపరచాలని, ప్రపంచవ్యాప్తంగా నౌకాశ్రయాల్లో ఆక్రమణ జాతులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికలు సిద్ధం చేయాలని టాంబుర్రీ ప్రభుత్వాలు, షిప్పింగ్ సంస్థలకు సూచించారు.
అంటువ్యాధులను నియంత్రించినట్లే ఈ సమస్యను కూడా ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) కూడా నౌకల అడుగు భాగంలో పేరుకుపోయే జీవపొరలు విదేశీ జలచర జాతుల వ్యాప్తికి ప్రధాన కారణమవుతాయని పేర్కొంది.
వివరాలు
సమస్యను నియంత్రించేందుకు నౌకల బయోఫౌలింగ్
దీర్ఘకాలం ఒకే ప్రాంతంలో నిలిచిన నౌకలను శుభ్రం చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తే ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరించింది.
ఈ సమస్యను నియంత్రించేందుకు నౌకల బయోఫౌలింగ్ నిర్వహణపై ప్రత్యేక చట్టబద్ధ నిబంధనలను రూపొందించే పనిలో ఉన్నట్లు వెల్లడించింది.
పగడపు దిబ్బలు, సముద్ర గడ్డి మైదానాలు, ఓయిస్టర్ నివాస ప్రాంతాలు వంటి అత్యంత విలువైన సముద్ర జీవవ్యవస్థలు ఈ పరిస్థితి వల్ల శాశ్వత నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధాలు, ఘర్షణల్లో మానవ ప్రాణాలను కాపాడటమే అత్యంత ముఖ్యమైన అంశమైనప్పటికీ, వాటి వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలను కూడా విస్మరించరాదని వారు స్పష్టం చేశారు.