
Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
వలసదారుల బహిష్కరణ అంశంపై అమెరికా సుప్రీంకోర్టు తాజాగా ఓ తీర్పును వెల్లడించింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వెనెజులాకు చెందిన గ్యాంగ్‌ను బహిష్కరించేందుకు తన ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను సుప్రీంకోర్టు అడ్డుకోవడం పట్ల ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ఆయన.. సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు.
Details
నేరస్తులకు ప్రోత్సాహమా?
"మన దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చిన వారిని బలవంతంగా వెనక్కి పంపించడాన్ని సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందులో హంతకులు, డ్రగ్ డీలర్లు, నేరస్థులు ఉన్నారు. వారిని చట్టబద్ధంగా బయటకు పంపించాలంటే సంవత్సరాలు పడుతోంది. ఈలోపు వారు దేశంలో అనేక నేరాలకు పాల్పడతారు. ఇది అమెరికన్లకు ముప్పుగా మారుతుంది. ఈ తీర్పు దేశంలోకి నేరస్థుల ప్రవేశానికి ప్రోత్సాహమిస్తుందంటూ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.
Details
బైడెన్‌పై విమర్శలు
ఇక జో బైడెన్ పాలనను టార్గెట్ చేసిన ట్రంప్, ఆయన లక్షలాది మంది అక్రమ వలసదారులను దేశంలోకి అనుమతించారని తీవ్ర ఆరోపణలు చేశారు. "వారు చట్టబద్ధంగా దేశం విడిచిపెయ్యాలంటే చాలా గడువు పడుతుంది. ఇది దేశ భద్రతకు విఘాతమని మండిపడ్డారు. దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న న్యాయమూర్తులు జస్టిస్ అలిటో, జస్టిస్ థామస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
Details
ఏలియన్ ఎనిమీస్ యాక్ట్‌ను ఆధారంగా..
1798 నాటి 'ఏలియన్ ఎనిమీస్ యాక్ట్' ఆధారంగా వెనెజులాకు చెందిన గ్యాంగ్‌ను అమెరికా నుంచి బహిష్కరించాలని ట్రంప్ యత్నించారు. అయితే సుప్రీంకోర్టు ఈ చర్యపై బ్రేక్ వేసింది. ఈ వలసదారులకు బహిష్కరణను చట్టబద్ధంగా సవాలు చేసేందుకు తగిన అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికాకు ఇది 'చెడు, ప్రమాదకరమైన రోజు'గా అభివర్ణించారు.