White House: వైట్ హౌస్ ప్రతినిధుల విందులో అధ్యక్షుడిపై హత్యాయత్నం.. నిందితుడిపై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
వైట్ హౌస్ ప్రతినిధుల విందు కార్యక్రమంలో కాల్పులకు పాల్పడిన కోల్ టొమాస్ ఎలెన్‌పై నేరాభియోగం నమోదు అయ్యింది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలని ప్రయత్నించాడని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఇదికాకుండా మరిన్ని రెండు నేరాలను కూడా అతనిపై మోపారు. ఈతీవ్ర ఆరోపణల కింద కేంద్ర న్యాయస్థానంలో అతను విచారణను ఎదుర్కొంటున్నాడు. ప్రభుత్వ తరఫు న్యాయవాదులు న్యాయస్థానంలో వాదిస్తూ,ఇది అధ్యక్షుడిని హత్య చేయడానికి చేసిన స్పష్టమైన ప్రయత్నమని పేర్కొన్నారు. నిందితుడు తన కుటుంబానికి పంపిన సందేశంలో తన ఉద్దేశాన్ని స్పష్టంగా వెల్లడించాడని తెలిపారు. అధ్యక్షుడిని చంపాలనే సంకల్పంతోనే ఈ చర్యకు దిగాడని చెప్పారు. అయితే భద్రతా సిబ్బంది వేగంగా స్పందించడంతో అధ్యక్షుడు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
వివరాలు
కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 30కి వాయిదా
సోమవారం ఈ కేసు విచారణ జరిగింది. నిందితుడి తరఫున వాదించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇద్దరు ప్రభుత్వ న్యాయవాదులను నియమించారు. ఎలెన్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని,నేరం రుజువయ్యేంతవరకు అతన్ని నిర్దోషిగా పరిగణించాలని న్యాయవాది టెజిరా అబే వాదించారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 30న జరగనుంది.అప్పుడే అతనికి జైలు లేదా బెయిల్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా,గతంలో కూడా ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో హత్యాయత్నం జరిగింది. 2024లో పెన్సిల్వేనియాలో జరిగిన ఘటనలో థామస్ క్రూక్స్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన తరువాత భద్రతా సిబ్బంది చేతిలో మరణించాడు. ప్రస్తుతం ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో,ఈ కేసులో హత్యాయత్నం నేరం రుజువైతే ఎలెన్‌కు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
వివరాలు
రెండు నేరాలు నమోదు
అలాగే అనుమతి లేకుండా ఆయుధం కలిగి ఉండటం, ఆయుధంతో దాడి చేయడానికి ప్రయత్నించడం వంటి రెండు నేరాలను కూడా నమోదు చేశారు. వీటిలో ఒకదానికి భారీ జరిమానా, మరొకదానికి పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. శనివారం రాత్రి వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగానికి ముందు, అదే హోటల్‌లో ఉన్న ఎలెన్ భద్రతా వలయాన్ని దాటి కాల్పులకు ప్రయత్నించాడు. అయితే సమావేశం జరుగుతున్న గదివైపు వెళ్లకుండా భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వివరాలు
మేనిఫెస్టోలో ఉన్న అంశాలు
కోల్ టొమాస్ ఎలెన్ చదువుకున్న వ్యక్తి కాగా కాలిఫోర్నియాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. దాడికి ముందు తన కుటుంబానికి రాసిన లేఖలో ట్రంప్‌పై పలు ఆరోపణలు చేశాడు. దేశానికి హాని చేసే వ్యక్తిని అంగీకరించలేనని పేర్కొన్నాడు. అయితే ఆ ఆరోపణల్లో ఎక్కడా ట్రంప్ పేరు నేరుగా ప్రస్తావించలేదు. ప్రభుత్వ ఉన్నత వర్గాలే తన లక్ష్యమని తెలిపాడు. దేశంలో జరుగుతున్న పరిస్థితులను భరించలేకనే ఈ చర్యకు దిగుతున్నానని పేర్కొన్నాడు. ఇతరులకు హాని చేయాలని తన ఉద్దేశం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో అలా జరిగితే క్షమించాలని కోరాడు. అలాగే హోటల్ భద్రత బలహీనంగా ఉందని కూడా తన లేఖలో పేర్కొన్నాడు.
వివరాలు
ట్రంప్ రియాక్షన్..
ఎలెన్ చేసిన ఆరోపణలను ట్రంప్ పూర్తిగా ఖండించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నిందితుడు తీవ్ర భావజాలంతో ఉన్న వ్యక్తి అని, అతని మానసిక స్థితి సరిగా లేదని పేర్కొన్నారు. కాల్పుల సమయంలో తాను భయపడలేదని, ఏమి జరుగుతుందో చూడాలనిపించిందని చెప్పారు. అయితే భద్రతా సిబ్బంది తనను వెంటనే అక్కడి నుంచి తరలించారని తెలిపారు.