China- Taiwa: తైవాన్ విదేశాంగ మంత్రి భారత్‌లో ఇంటర్వ్యూ.. ఉలిక్కిపడ్డ చైనా
తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూను ఇంటర్వ్యూను ఓ భారత మీడియా ఛానెల్ ప్రసారం చేయడంపై చైనా ఉలిక్కిపడింది. ఆ ఇంటర్వ్యూపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 'తైవాన్ స్వాతంత్ర్యం'ను సమర్ధించేందుకు భారతీయ ఛానల్ వేదిక కల్పించిందని చైనా పేర్కొంది. తైవాన్‌కు సంబంధించి భారత్ 'వన్ చైనా పాలసీ'ని అనుసరిస్తోందని వెల్లడించింది. తైపీతో అధికారిక దౌత్య సంబంధాలు లేవని భారత్ గమనించాలని చెప్పింది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని చైనా వివరించింది.
మేము తోలుబొమ్మలం కాదు: తైవాన్
'ప్రపంచంలో ఒకే చైనా ఉందని, అందులో తైవాన్ భాగమని ప్రకటనలో తెలిపింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం మొత్తం చైనాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక చట్టపరమైన ప్రభుత్వం అని వెల్లడించింది. అయితే చైనా ప్రకటనను తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్- తైవాన్ స్వేచ్ఛా, శక్తివంతమైన జర్నలిజంతో కూడిన ప్రజాస్వామ్య దేశాలని చెప్పంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC)లో తైవాన్ భాగం కాదని చెప్పింది. తాము చైనాలో చేతిలో కీలుబొమ్మలం కాదని స్పష్టం చేసింది. చైనా తన ఆర్థిక వ్యవస్థ పతనం గురించి ఆలోచించుకోవాలని, పొరుగువారిని బెదిరించడం మానుకోవాలని తైవాన్ హితవు పలికింది.