కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోండి: డబ్ల్యూహెచ్ఓ
కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ దేశాలకు సూచించింది. 2022లో కలుషితమైన దగ్గు సిరప్‌లు తాగి అనేక మంది చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ హెచ్చరిక జారీ చేసింది. గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్‌లో ఐదేళ్లలోపు 300 మందికి పైగా పిల్లలు కలుషితమైన దగ్గు సిరప్ తాగి మరణించారు. కలుషితమైన సిరప్‌లు తాగడం వల్ల కిడ్నీలు ఫెయిలై ఆ చిన్నారులు చనిపోయారు. కొన్ని దగ్గు సిరప్‌లలో ప్రమాదకర డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అధిక మోతాతులో ఉన్నట్లు గుర్తించినట్లు ఫలితంగా చిన్నారుల్లో కిడ్నీలు దెబ్బ తింటున్నట్లు డబ్ల్యూహెచ్ఓ చెప్పింది.
ఔషధాలపై ప్రపంచస్థాయి పరీక్షలు జరపాలి: డబ్ల్యూహెచ్ఓ
కలుషితమైన మందులపై ఒక దేశం చర్యలు తీసుకుంటే సరిపోదని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. మందుల సరఫరా అనేది మార్కెట్ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది కాబట్టి 194 సభ్య దేశాలు కలిసికట్టుగా హానికరమైన ఔషధాలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో చాలామంది చిన్నారుల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. సభ్యదేశాలన్నీ తమ దేశాల్లో తయరవుతున్న ఔషధాలపై ప్రపంచస్థాయి పరీక్షలు జరపాలనే నిబంధనలను విధించాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. భారత ఔషధ సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి తమ దేశంలో 18మంది చనిపోయారని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సిరప్‌ల ఉత్పత్తిని భారత్ కూడా నిలిపివేసింది.