నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ
నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసింది. మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన అంబ్రోనాల్, డాక్-1 దగ్గు సిరప్‌లలో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. భద్రత విషయంలో కూడా మారియన్ బయోటెక్ కంపెనీ విఫలమైనట్లు చెప్పింది. స్పెసిఫికేషన్స్ విషయంలో కూడా తమ అంచనాలను అందుకోలేదని వివరించింది. అంబ్రోనాల్, డాక్-1 దగ్గు సిరప్ నమూనాలను ఉజ్బెకిస్తాన్ జాతీయ నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలో పరీక్షించగా.. ఆ రెండింటిలోనూ ఆమోదయోగ్యం కాని మొత్తంలో డైథైలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్ కలుషితాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.
ఆ సిరప్‌లతో పిల్లల ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరిక
మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన అంబ్రోనాల్, డాక్-1 దగ్గు సిరప్‌లకు కొన్ని దేశాల్లో మార్కెంటింగ్ ఉండవచ్చని, అక్కడి నుంచి ఉజ్బెకిస్థాన్‌తో పాటు ఇతర ప్రాంతాలకు అనధికారిక మార్కెట్ల ద్వారా పంపిణీ చేయబడి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అయితే ఈ నాసిరకం ఉత్పత్తుల వాడకం సురక్షిత కాదని, ముఖ్యంగా పిల్లల్లో ఇవి తీవ్రమైన అనారోగ్యానికి, మరణానికి దారితీయొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. అంబ్రోనాల్, డాక్-1 దగ్గు సిరప్‌లు తాగి ఉజ్బెకిస్థాన్‌లో 18మంది చనిపోయారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ దేశ ప్రభుత్వం భారత్‌ను సంప్రదించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విచారణ జరుపుతున్నట్లు.. ఇప్పటికే దగ్గు సిరప్ తయారీని నిలిపివేసినట్లు భారత్ తెలిపింది.