Loading...
Hormuz: హర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరంలో ట్యాంకర్‌కు మంటలు
హర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరంలో ట్యాంకర్‌కు మంటలు

Hormuz: హర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరంలో ట్యాంకర్‌కు మంటలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కీలకమైన హోర్ముజ్ జలసంధిలో చమురు నౌకలపై దాడులు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై దాడి జరిగింది. దీంతో నౌకలోని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి. ఈ నౌకను పనామా దేశ జెండాతో ప్రయాణిస్తున్న 'ఓఎన్ ఫీనిక్స్'గా గుర్తించారు. ఈ దాడిని ఇరాన్ నావికాదళం కూడా ధ్రువీకరించింది.

వివరాలు 

హోర్ముజ్ జలసంధిలో ట్యాంకర్‌పై దాడి

యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 16న హోర్ముజ్ జలసంధి నుంచి బయటకు వెళ్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై దాడి జరిగింది.

ఈ ఘటనలో నౌక ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

నౌకలో ఉన్న సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఒమన్ తీరానికి సుమారు మూడు నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే దాడి కారణంగా నౌకకు ఎంతమేర నష్టం జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. అలాగే సముద్రంలో చమురు లీకైందా? లేదా? అనే దానిపైనా స్పష్టత లేదు.

వివరాలు 

ఆంక్షలు ఉల్లంఘించిందన్న ఇరాన్ నావికాదళం

ఈ దాడిపై స్పందించిన ఇరాన్ నావికాదళం..సదరు ట్యాంకర్ తాము ఆంక్షలు విధించిన ప్రాంతంలో ప్రయాణిస్తోందని పేర్కొంది.

అంతేకాకుండా నౌక తన నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేసిందని ఆరోపించింది.

ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించవద్దని ఇరాన్ పలుమార్లు హెచ్చరించినప్పటికీ.. నౌకలోని సిబ్బంది ఆ సూచనలను పట్టించుకోలేదని ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ వెల్లడించింది.

24 గంటల్లో నాలుగో దాడి

గత 24 గంటల వ్యవధిలో హోర్ముజ్ జలసంధిలో చోటుచేసుకున్న నాలుగో దాడి ఇదే కావడం గమనార్హం.

వరుసగా నౌకలపై దాడులు జరుగుతుండటంతో అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

ముఖ్యంగా చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT