Pavel Durov: పెళ్లికాని మహిళలకు టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ బంపర్ ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు,సీఈఓ పావెల్ దురోవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 37 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న మహిళలు ఆయన వీర్యాన్ని ఉపయోగించి ఐవీఎఫ్ (IVF) సాయం పొందితే, ఆ ఖర్చులను ఆయన భరిస్తారని ఆఫర్ చేశారు. ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్ట్ కథనం ద్వారా వెల్లడించింది. దురోవ్ వీర్యాన్ని రష్యా రాజధాని మాస్కోలోని ఒక క్లినిక్‌లో అందుబాటులో ఉంచారు. ఇది ఆయన గతంలో దానం చేసిన వీర్యమే. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం దానిని దానం చేయడం ఆయన ఆపేశారు. గతంలో ఫ్రీజ్ చేసిన వీర్యాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. వీర్య దానం గురించి దురోవ్ తరచూ మీడియా లో చర్చలకు వస్తారు.
వివరాలు
తన ఆస్తిలో డీఎన్‌ఏ నిరూపించిన పిల్లలందరికీ సమాన వాటా
"ఆరోగ్యవంతమైన వీర్యకణాలను దానం చేసే వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు. అందువల్ల, సంతానం లేని దంపతులకు సహాయం చేయడం సామాజిక బాధ్యత అని భావించాను" అని ఆయన చెప్పారు. తన 15 ఏళ్ల వీర్య దానంతో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో 100 మంది పిల్లలు జన్మించారని, తన సంపదను వారికి పంచుతానని ఈ టెలిగ్రామ్ సీఈఓ ఇప్పటికే ప్రకటించారు. గత సంబంధాల వల్ల ఆయనకు ఆరుగురు సంతానం ఉన్నారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సంపద 14-17 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంపద మొత్తం తన పిల్లలందరికీ సమానంగా ఇవ్వాలని వీలునామాలో పేర్కొన్నారు.