Seattle Diwali Celebrations: అమెరికాలో దీపావళి వేడుకల్లో ఉద్రిక్తత.. భారతీయులను అడ్డుకునేందుకు జేక్ లాంగ్ యత్నం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న వేళ.. అమెరికాలో చోటుచేసుకున్న ఓ ఘటన కలకలం రేపింది. వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో భారతీయులు స్థానికులతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహిస్తుండగా, కొందరు ఆందోళనకారులు అక్కడికి వచ్చి గొడవకు ప్రయత్నించారు. వేడుకలు జరుగుతున్న ప్రాంతంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. నిర్వాహకులు, అక్కడున్నవారు ధైర్యంగా అడ్డుకోవడంతో పెద్ద ఘర్షణ తప్పింది.
వివరాలు
విద్వేష నినాదాలతో వేడుకలకు ఆటంకం
సియాటెల్ సెంటర్ సమీపంలో కుటుంబాలు, చిన్నారులతో కలిసి భారతీయులు దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గతంలో క్యాపిటల్ భవనంపై దాడి కేసులో జైలుకు వెళ్లివచ్చిన జేక్ లాంగ్ అనే వ్యక్తి తన అనుచరులతో అక్కడికి వచ్చినట్లు కథనాలు పేర్కొన్నాయి.
వారి చేతుల్లో జాతివిద్వేష నినాదాలు ఉన్న బోర్డులు కనిపించాయి. భారతీయులు, హిందూ సమాజాన్ని అవమానించేలా నినాదాలు చేస్తూ వేడుకలకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించారు.
అయితే అక్కడున్నవారు, వేడుకల నిర్వాహకులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆందోళనకారులను అడ్డుకున్నారు.
వారిని లోపలికి రానివ్వకుండా నిలదీయడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
వివరాలు
సోషల్ మీడియాలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు
వేడుకల ప్రాంగణం నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా జేక్ లాంగ్ సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు చేసినట్లు కథనాలు వెల్లడించాయి.
ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి, ఆ పార్టీకి పట్టున్న ప్రాంతాలను కోల్పోవడానికి హిందూ ఓటర్లే కారణమంటూ ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నాయి.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే ఆయన దీపావళి వేడుకల వద్ద ఈ విధంగా వ్యవహరించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
జాత్యహంకారానికి తావులేదు: భారతీయ అమెరికన్ నాయకులు
దీపావళి వేళ జరిగిన ఈ ఘటనను భారతీయ అమెరికన్ నాయకులు, సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
ప్రముఖ నాయకురాలు ప్రమీలా జయపాల్ సహా పలువురు స్పందిస్తూ.. దీపావళి అంటే చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అని, సమాజంలో జాత్యహంకారానికి చోటు ఉండకూడదని పేర్కొన్నారు.
ఇటీవల చికాగో సమీపంలో ఓ ఆలయంపై దాడికి కుట్ర జరిగిన ఘటన మరవకముందే.. సియాటెల్లోనూ ఇలాంటి ప్రయత్నం చోటుచేసుకోవడం ప్రవాస భారతీయుల్లో ఆందోళన కలిగిస్తోంది.
విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, పండుగ వేడుకలు, ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను మరింత పెంచాలని స్థానిక ప్రభుత్వాన్ని భారతీయ అమెరికన్ సంఘాలు కోరుతున్నాయి.