LOADING...
Bab al-Mandeb: మాండెబ్ జలసంధిపై టెన్షన్.. ప్రపంచ వాణిజ్యానికి గుబులు
మాండెబ్ జలసంధిపై టెన్షన్.. ప్రపంచ వాణిజ్యానికి గుబులు

Bab al-Mandeb: మాండెబ్ జలసంధిపై టెన్షన్.. ప్రపంచ వాణిజ్యానికి గుబులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2026
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్‌ జలసంధి వద్ద ఇరాన్‌ చేపట్టిన దిగ్బంధనంతో ఇప్పటికే అంతర్జాతీయ నౌకాయానానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావంతో అనేక దేశాలు చమురు, గ్యాస్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో మరో కీలక సముద్ర మార్గమైన బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధిపైనా ముప్పు ముంచుకొస్తోంది. తమ ఖర్గ్‌ దీవిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగితే ఈ జలసంధిని కూడా మూసివేస్తామని ఇరాన్‌ అమెరికాకు హెచ్చరించింది. ఈ మార్గం కూడా ఆగిపోతే ప్రపంచ వాణిజ్యానికి మరింత పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంది.

వివరాలు

బాబ్‌ అల్‌ మాండెబ్‌ అంటే ఏమిటి?

అరేబియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న ఈ జలసంధి, ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానించే కీలక మార్గం. అరబిక్‌లో 'బాబ్‌ అల్‌ మాండెబ్‌' అంటే 'కన్నీటి ద్వారం' లేదా 'విషాద ద్వారం' అని అర్థం. గతంలో ఇక్కడ ప్రతికూల పరిస్థితుల వల్ల అనేక నౌకలు ప్రమాదాలకు గురికావడంతో ఈ పేరు ఏర్పడింది. 1869లో సూయజ్‌ కాలువ ప్రారంభమైన తర్వాత ఈ మార్గానికి మరింత ప్రాధాన్యం పెరిగింది.

వివరాలు

ఎందుకు అంత కీలకం?

యెమెన్‌, జిబౌటి దేశాల మధ్య ఉన్న ఈ జలసంధి, మధ్యధరా సముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు నౌకాయానానికి ప్రధాన లింక్‌గా పనిచేస్తోంది. సూయజ్‌ కాలువ వైపు ప్రయాణించే నౌకలు, ముఖ్యంగా చమురు ట్యాంకర్లకు ఇది అత్యంత కీలక మార్గం. ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌కు మధ్య ద్వారంలా ఇది వ్యవహరిస్తోంది. సుమారు 30 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండటం వల్ల వ్యూహాత్మకంగా కూడా ఇది అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడుతోంది.

Advertisement

వివరాలు

ఎంత వాణిజ్యం జరుగుతోంది?

ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా దేశాల మధ్య ప్రయాణించే నౌకలకు ఈ జలసంధి ఒక ప్రధాన గేట్‌వే. రోజుకు దాదాపు 45 లక్షల బ్యారెళ్ల చమురు ఈ మార్గంలో రవాణా అవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10-12 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతోంది. ద్రవీకృత సహజ వాయువు (LNG), తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు కూడా భారీగా ఇక్కడి నుంచి తరలించబడుతున్నాయి. ఏటా లక్షల కోట్ల రూపాయల విలువైన సరకు రవాణా ఈ మార్గంలో జరుగుతోంది.

Advertisement

వివరాలు

హూతీల ప్రభావం

ఇరాన్‌ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు ఇప్పటికే ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నారు. యెమెన్‌లోని కొన్ని ఎర్ర సముద్ర తీర ప్రాంతాలను నియంత్రిస్తున్న ఈ ముఠా, సముద్ర మార్గాల్లో దాడులు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2023 అక్టోబర్‌ 7న గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత, పాలస్తీనాకు మద్దతుగా హూతీలు రంగంలోకి దిగారు. డ్రోన్లు, క్షిపణులు, పేలుడు పడవలతో వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. రెండు నెలల్లోనే 134 నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. ఫలితంగా ఎర్ర సముద్ర వాణిజ్యం 60 శాతానికి పైగా తగ్గిపోయింది. నాలుగు నౌకలు మునిగిపోయిన ఘటనలు కూడా నమోదయ్యాయి.

వివరాలు

మూసేస్తే ఏమవుతుంది?

ఈ జలసంధిని ఇరాన్‌ దిగ్బంధిస్తే, నౌకలు ఆఫ్రికా దక్షిణ భాగం చుట్టూ ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతాయి. దీని ప్రభావం చమురు ధరల పెరుగుదలగా, ఇంధన మార్కెట్లలో అస్థిరతగా కనిపించవచ్చు. అయితే ఈ జలసంధి మూసివేతకు అమెరికా గట్టి ప్రతిస్పందన ఇచ్చే అవకాశం ఉంది. జిబౌటి ప్రాంతంలో అమెరికాకు భారీ సైనిక స్థావరం ఉండటంతో, ఈ మార్గాన్ని రక్షించేందుకు అగ్రరాజ్యం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి, బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధిపై నెలకొన్న తాజా ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యానికి, ఇంధన భద్రతకు కీలక సవాలుగా మారుతున్నాయి.

Advertisement