Loading...
G20 Meeting: జీ20 సమావేశంలో భగ్గుమన్న విభేదాలు.. రష్యా మంత్రితో ఫొటోకు ఐరోపా దేశాల నో!
జీ20 సమావేశంలో భగ్గుమన్న విభేదాలు.. రష్యా మంత్రితో ఫొటోకు ఐరోపా దేశాల నో!

G20 Meeting: జీ20 సమావేశంలో భగ్గుమన్న విభేదాలు.. రష్యా మంత్రితో ఫొటోకు ఐరోపా దేశాల నో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ వేదికలపై నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో కలిసి గ్రూప్ ఫొటోలో కనిపించేందుకు కొన్ని ఐరోపా దేశాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సంప్రదాయంగా నిర్వహించే జీ20 విదేశాంగ మంత్రుల గ్రూప్ ఫొటో కార్యక్రమాన్ని చివరి నిమిషంలో రద్దు చేయాల్సి వచ్చింది. ఈ పరిణామం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం అమెరికాలోని అట్లాంటాలో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ భేటీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇతర సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచం ప్రస్తుతం కీలకమైన మలుపులో ఉందని రూబియో పేర్కొన్నారు.

వివరాలు

గ్రూప్ ఫొటో కార్యక్రమాన్ని రద్దు చేసిన నిర్వాహకులు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ సంక్షోభాలను పరిష్కరించేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధం కారణంగా సభ్య దేశాల మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, సమావేశం సందర్భంగా రష్యా ప్రతినిధులతో కలిసి గ్రూప్ ఫొటో దిగేందుకు కొన్ని ఐరోపా దేశాల అధికారులు ఆసక్తి చూపలేదని దౌత్య వర్గాలు వెల్లడించాయి.

సెర్గీ లావ్రోవ్‌తో ఒకే ఫొటోలో కనిపించడం తమకు ఇష్టం లేదని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపాయి.

దీంతో శుక్రవారం ఉదయం సమావేశం ప్రారంభానికి కొద్దిసేపటి ముందు నిర్వహించాల్సిన సంప్రదాయ గ్రూప్ ఫొటో కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు.

వివరాలు

ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న విభేదాలు

కాగా ఈ ఏడాది గతంలో నిర్వహించిన జీ20 సమావేశాల్లోనూ కొందరు ఐరోపా నాయకులు రష్యా ప్రతినిధులతో కలిసి ఫొటోలు దిగేందుకు నిరాకరించారు.

2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి ప్రారంభమైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు రష్యాను దౌత్యపరంగా దూరంగా ఉంచుతున్నాయి.

తాజాగా అట్లాంటాలో జరిగిన పరిణామం కూడా ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న విభేదాలను మరోసారి స్పష్టం చేసింది.

మరోవైపు గ్రూప్ ఫొటో కార్యక్రమం రద్దుపై అమెరికా అధికారి ఒకరు స్పందించారు. వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు వివరించారు.

కేవలం ఒక సంప్రదాయ ఫొటో కార్యక్రమం కారణంగా కీలకమైన దౌత్య చర్చలు పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ADVERTISEMENT