Australia Woman - VAD: చికిత్సలేని వ్యాధితో నరకయాతన.. 25 ఏళ్ల వయసులోనే జీవితానికి గుడ్‌బై
ఈ వార్తాకథనం ఏంటి
చికిత్సకు లొంగని అరుదైన న్యూరాలజికల్ వ్యాధితో ఎన్నేళ్లుగా నరకం అనుభవించిన ఓ ఆస్ట్రేలియా యువతి, చివరకు 25 ఏళ్లకే కారుణ్య మరణాన్ని ఎంచుకునే నిర్ణయానికి చేరుకుంది. చిన్నప్పటి నుంచే ఆరోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో జీవితం మొత్తం ఆసుపత్రులకే పరిమితమైపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అడిలెయిడ్‌కు చెందిన అనాలిసే హోలాండ్ బాల్యంలో దాదాపు ఎక్కువ సమయం బెడ్‌లపైనే గడిచిపోయింది. తరచూ వచ్చే అనారోగ్యాలతో ఆమె ఆసుపత్రి పాలవడం నిత్యకృత్యంలా మారిపోయింది. అసలు ఏ వ్యాధి బాధిస్తోంది అనేది వైద్యులకు కూడా చాలాకాలం అర్ధంకాలేదు. చివరకు 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమెకు 'ఆటో ఇమ్మ్యూన్ గాంగ్లియోపతి' ఉందని నిర్ధారించారు.
వివరాలు
ఐవీ ద్వారా రక్తంలోకి పోషకాలు
ఈ వ్యాధి ఉన్నవారిలో రోగనిరోధక వ్యవస్థే నాడీ కణాలను దాడి చేస్తుంది. దాంతో శరీరంలోని ముఖ్యమైన జీవక్రియలు కూడా అదుపు తప్పుతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె పరిస్థితి మరింత బలహీనమైంది. ఆహారం తీసుకునే శక్తి కూడా తగ్గిపోవడంతో పోషకాలు నేరుగా ఐవీ ద్వారా రక్తంలోకి పంపాల్సిన పరిస్థితి వచ్చింది. బీపీ,గుండె చలనం రేటు,జీర్ణవ్యవస్థ వంటివన్నీ అదుపు తప్పిపోయాయి.
వివరాలు
రక్తంలో ఇన్ఫెక్షన్
"మలవిసర్జన పూర్తిగా ఆగిపోయింది. పేగుల్లో ఎలాంటి బ్లాకేజీ లేకపోయినా మలం బయటకు రావడం లేదు.ఫలితంగా లోపల వ్యర్థాలు పేరుకుపోయేవి. అవి చివరకు వాంతుల రూపంలో బయటపడేవి. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. అందుకే డాక్టర్లు నాకు ప్రత్యేక ట్యూబుల ద్వారా పోషకాహారం నేరుగా రక్తంలోకి పంపడం ప్రారంభించారు.కానీ ఆ సమయంలో ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా పరిస్థితి ప్రమాదకరంగా మారేదే,"అని ఆమె వెల్లడించింది. సమయం గడుస్తున్న కొద్దీ పరిస్థితి అత్యంత క్లిష్టమైంది.అవయవాలు దెబ్బతినడం ప్రారంభించాయి. వెన్నెముక విరిగిపోయింది. నిరంతరం నొప్పి, ఒత్తిడి, ఆందోళన ఆమెను క్షణం కూడా విడిచిపెట్టలేదు. పలుమార్లు రక్తంలో ఇన్ఫెక్షన్ చేరడంతో ఆమె ప్రాణాపాయక స్థితిలోకి వెళ్లింది. దీనికి శాశ్వత చికిత్స లేకపోవడంతో చివరికి జీవితాన్ని ముగించాలని ఆమె నిర్ణయించుకుంది.
వివరాలు
దరఖాస్తుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదం
వాలంటరీ అసిస్టెడ్ డైయింగ్ ద్వారా తనువు చాలించాలని కోరుకుంది. 'నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. పిల్లలు ఉన్నారు. నా జీవితం ముందుకెళ్లదు. ఇది జీవితం కాదు. ప్రతి రోజూ పోరాటం' అని చెప్పింది. వాలంటరీ అసిస్టెడ్ డైయింగ్ (VAD - కారుణ్య మరణం) కోసం చేసిన ఆమె దరఖాస్తుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక చివరికి అయినా తనకు శాంతి లభించబోతుందన్న ఆలోచనతో ఆమె సాంత్వన పొందుతోంది. ఈ పరిస్థితుల్లో మరో మార్గం లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులూ ఆమె నిర్ణయానికి మద్దతు తెలిపారు.