LOADING...
Congo church attack: కాంగోలో చర్చి వద్ద ఉగ్రదాడి.. 21 మంది మృతి!
కాంగోలో చర్చి వద్ద ఉగ్రదాడి.. 21 మంది మృతి!

Congo church attack: కాంగోలో చర్చి వద్ద ఉగ్రదాడి.. 21 మంది మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2025
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికా ఖండంలోని కాంగో (Congo)లో మళ్లీ తీవ్ర ఉగ్రవాద దాడి జరిగింది. ఇస్లామిక్‌ స్టేట్‌ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్‌ (ADF) తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. తూర్పు కాంగోలోని కోమాండా ప్రాంతంలోని ఓ క్యాథలిక్‌ చర్చ్‌ ప్రాంగణంలో ఈ దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో కాల్పులు జరిపిన ఆ గ్రూపు.. కనీసం 21 మంది నిరాయుద్ధ పౌరులను పొట్టన పెట్టుకుంది. స్థానిక సామాజిక కార్యకర్తల ప్రకారం.. మూడు మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో బయటపడగా, అనేక ఇళ్లు, దుకాణాలు మంటల్లో కాలిపోయాయని వెల్లడించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Details

ఇప్పటివరకూ 6వేల మంది మృతి

ఇక కాంగో సైనిక ప్రతినిధి కూడా ఈ దాడిని ధ్రువీకరించారు. అయితే ఈ దాడిలో 10 మంది మాత్రమే మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం అందిందని చెప్పారు. ఉగాండా-డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తున్న ADF సంస్థ.. గత కొంతకాలంగా పౌరులే లక్ష్యంగా ఉగ్రదాడులకు పాల్పడుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు ADF దాడుల్లో దాదాపు 6,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సంస్థపై అమెరికా ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు విధించినప్పటికీ.. దాడులు ఆగడంలేదు.