Texas: స్కూళ్లలో హెచ్-1బీ ఉద్యోగులకు నో.. కీలక చట్టానికి టెక్సాస్ సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్-1బీ వీసాదారుల నియామకాల విషయంలో టెక్సాస్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కొత్త హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేయకుండా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తాజాగా ఇదే తరహా నిబంధనలను ప్రభుత్వ పాఠశాలలకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబోట్ ప్రతిపాదించారు. ప్రభుత్వ స్కూళ్లలో హెచ్-1బీ వీసాపై పనిచేసే ఉద్యోగులను నియమించకుండా నిషేధం విధించేలా త్వరలో చట్టం తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. టెక్సాస్ విద్యా వ్యవస్థలో విదేశీ వ్యక్తులు, సంస్థల ప్రభావాన్ని తగ్గించడమే తన ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశమని అబోట్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు విదేశీ సంస్థలు లేదా వ్యక్తుల నుంచి విరాళాలు, ఇతర కానుకలు స్వీకరించకుండా నిబంధనలు తీసుకురావాలని కూడా భావిస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
గవర్నర్ సంతకం చేస్తే అది చట్టంగా అమల్లోకి..
అలాగే విదేశీ సంస్థలు, వ్యక్తులతో ప్రభుత్వ పాఠశాలలు ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకోవడంపైనా ఆంక్షలు విధించనున్నట్లు చెప్పారు.
టెక్సాస్ చట్టసభలు వచ్చే ఏడాది సమావేశం కానున్నాయి. ఆ సమయంలో ఈ ప్రతిపాదనలపై చట్టసభ్యులు చర్చించే అవకాశం ఉంది.
శాసనసభలో బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం గవర్నర్ సంతకం చేస్తే అది చట్టంగా అమల్లోకి వస్తుంది.
అయితే ఈ ప్రతిపాదిత చట్టం అమలైతే ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్న టెక్సాస్ ప్రభుత్వ పాఠశాలలకు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
రాష్ట్రంలోని అనేక పాఠశాలలు టీచర్ల కొరతను అధిగమించేందుకు ఫెడరల్ హెచ్-1బీ వీసా కార్యక్రమంపై ఆధారపడుతున్నాయి.
ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి.
వివరాలు
టెక్సాస్ పాఠశాలల్లో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువ
అమెరికా నేషనల్ ఎడ్యుకేషన్ 2025 అధ్యయనం ప్రకారం.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టెక్సాస్ పాఠశాలల్లో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఫెడరల్ డేటా ప్రకారం.. ఒక్క డాలస్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లోనే హెచ్-1బీ వీసా కార్యక్రమం కింద 171 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఉపాధ్యాయుల నియామకాలపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
'బాబోయ్ అమెరికా' అంటున్న విదేశీ విద్యార్థులు
మరోవైపు ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంచుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా ఇటీవల తగ్గుతున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి.
కఠినమైన వీసా విధానాలు,భద్రతకు సంబంధించిన ఆందోళనలు తదితర కారణాలతో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు అంతర్జాతీయ విద్యార్థులు ఆసక్తి చూపడం తగ్గుతోంది.
ఈ అంశంపై తాజాగా నావిటాస్ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా సురక్షితమైన,స్థిరమైన గమ్యస్థానమనే అభిప్రాయాన్ని కేవలం 31శాతం మంది మాత్రమే వ్యక్తం చేశారు.
ఈ విషయంలో 88శాతం మంది విద్యార్థుల మద్దతుతో న్యూజిలాండ్ మొదటి స్థానంలో నిలిచింది.
ఆతర్వాతి స్థానాల్లో జర్మనీ,ఆస్ట్రేలియా ఉన్నాయి. అంటే విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఈ దేశాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది.
వివరాలు
'బాబోయ్ అమెరికా' అంటున్న విదేశీ విద్యార్థులు
వీసా ప్రాసెసింగ్ విషయంలోనూ అమెరికా వెనుకబడింది. బ్రిటన్‌లో వీసా ప్రక్రియ సానుకూలంగా, వేగంగా ఉందని 74.1 శాతం మంది విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
దీంతో యూకే ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. 64.8 శాతం రేటింగ్‌తో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది.
అదే సమయంలో అమెరికాకు కేవలం 25.3 శాతం రేటింగ్ మాత్రమే రావడం గమనార్హం.