
Thailand: థాయిలాండ్ ప్రధానమంత్రి పదవి నుంచి షినవత్రాను తొలగించిన రాజ్యాంగ ధర్మాసనం
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్ మాజీ ప్రధాన మంత్రి పాయ్‌టోంగ్‌టార్న్ షినవత్ర (39)కు దేశ రాజ్యాంగ న్యాయస్థానం మరో భారీ షాక్ ఇచ్చింది. పొరుగుదేశమైన కంబోడియా ప్రధానితో థాయ్ ప్రధాని షినవత్ర జరిపిన ఫోన్ సంభాషణపై గతంలో విమర్శలు రాగా.. ఆమెను కోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజా తీర్పులో ఆమెను పదవి నుంచి పూర్తిగా తొలగించే నిర్ణయం శుక్రవారం తీసుకున్నారు. థాయ్‌లాండ్-కంబోడియా మధ్య జరిగిన డిప్లొమాటిక్ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని, నైతిక ప్రమాణాలను ఉల్లంఘించినట్టే అని కోర్టు తీర్పు వెలువరించింది. జులై 2వ తేదీన 7-2 మెజారిటీతో తాత్కాలిక సస్పెన్షన్ విధించిన కోర్టు, తాజాగా అభియోగాలు రుజువైనందున ఆమెను అధికార పదవిని కోల్పోవడానికి తీర్పు చెప్పింది.
వివరాలు
థాయ్ తాత్కాలిక ప్రధాని పుమ్తామ్ వేచాయచాయ్
థాయ్ తాత్కాలిక ప్రధాని పుమ్తామ్ వేచాయచాయ్ కొనసాగుతున్నారు. ఈ తీర్పుతో థాయ్‌లాండ్ పార్లమెంట్ త్వరలో కొత్త ప్రధానమంత్రిని ఎన్నిక చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించనుంది. పాయ్‌టోంగ్‌టార్న్ షినవత్ర పదవి నుంచి తొలగించిన తర్వాత, ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత మంత్రివర్గం, కొత్త ప్రధానమంత్రిని ఎంపిక చేసేవరకు తాత్కాలికంగా ఫుమ్తామ్ వెచయాచాయ్ ప్రభుత్వం నడిపించనున్నారు. జరిగింది ఇదే.. పాయ్‌టోంగ్‌టార్న్ షినవత్ర కేవలం 37 ఏళ్ల వయసులో 2024 ఆగస్టులో ప్రధానమంత్రి పదవికి చేరి, దేశ చరిత్రలో అతి యువ ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, ఆమె అందం, ఫ్యాషన్, స్టైల్ లోనూ నెట్టింట ప్రసిద్ధి పొందారు.
వివరాలు
జరిగింది ఇదే..
అయితే,థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దు సమస్యలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి. 2025 మేలో ఈ ఉద్రిక్తతలు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి.అప్పుడే కంబోడియా మాజీ ప్రధాన మంత్రి హున్ సేన్‌కు పాయ్‌టోంగ్‌టార్న్ ఫోన్ చేశారు. ''అంకుల్'' అని సంబోధిస్తూ, దేశ పరిస్థితులను వివరించిన ఆమె,సరిహద్దులో ఉన్న థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్‌సిన్‌ను తన వ్యతిరేకిగా పేర్కొన్నారు. జూన్ 15న జరిగిన ఈ ఫోన్ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది. సాధారణంగా కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య సంబంధాలు పరిమితంగా ఉంటాయి. అయితే సరిహద్దు వివాదాల కారణంగా 2025 మే 28 నుండి అవి మరింత క్షీణించాయి. అయితే.. 2023లో హున్ సేన్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు.
వివరాలు
పదవి నుంచి తొలగించిన ఐదుగురు ప్రధానమంత్రులు వీరే..
పదవిలో లేకపోయినా, హున్ సేన్ కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తితో ఫోన్‌లో సున్నితమైన విషయాలను పంచుకోవడం దేశ భద్రతకు హాని కలిగించే చర్యగా పరిగణించబడింది. తర్వాత పాయ్‌టోంగ్‌టార్న్ ప్రజల ముందు క్షమాపణలు తెలిపారు. థాయ్‌లాండ్ రాజ్యాంగ కోర్టు గత 17 ఏళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులను పదవి నుంచి తొలగించింది. వీరి జాబితా ఇలా ఉంది: తక్సిన్ షినవత్ర (2006): సైనిక తిరుగుబాటు తర్వాత బలవంతపు పదవీ విరమణ, కోర్టు ద్వారా అనర్హత వేటు. సమక్ సుందరవేజ్ (2008): ప్రసిద్ధ టీవీ కుకింగ్ షోలో పాల్గొనడం కారణంగా నైతిక ఉల్లంఘన ఆరోపణలతో పదవి కోల్పోయారు.
వివరాలు
పదవి నుంచి తొలగించిన ఐదుగురు ప్రధానమంత్రులు వీరే..
యింగ్లక్ షినవత్ర (2014): ధాన్యం సబ్సిడీ స్కీమ్‌లో అవినీతి కారణంగా నైతిక ఉల్లంఘనలతో పదవి కోల్పోయారు. స్రేత్థా థావిసిన్ (2024): నైతిక ప్రమాణాలు ఉల్లంఘించారని కోర్టు ఏడాది లోనే తొలగించింది. పాయ్‌టోంగ్‌టార్న్ షినవత్ర (2025): కంబోడియా నేత హున్ సెన్‌తో ఫోన్ సంభాషణలో ''అంకుల్'' అని సంబోధించడం, సైనిక అధికారిని ప్రతిద్వంది అని పేర్కొనడం వలన నైతిక ఉల్లంఘనగా నిర్ణయించి పదవి నుంచి తొలగించారు.