Taiwan: తైవాన్‌లో ఏఐ బూమ్ లాభాలు.. ప్రతి పౌరుడికి రూ.30 వేల నగదు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగం వేగంగా విస్తరిస్తుండటంతో తైవాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనం కలుగుతోంది. ఏఐ ఆధారిత పరిశ్రమల వృద్ధితో పెరిగిన ఆదాయాన్ని ప్రజలతోనూ పంచుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి 10 వేల తైవాన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.30వేల నగదు అందించే ప్రతిపాదనను అధ్యక్షుడు లై చింగ్-తే తీసుకొచ్చారు. దీనికి 'ఏఐ డివిడెండ్' అనే పేరు పెట్టారు. ఏఐ, అధునాతన సెమీకండక్టర్లు, హై-పర్‌ఫార్మెన్స్ కంప్యూటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరగడంతో తైవాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థ 14.15 శాతం వృద్ధిని నమోదు చేసింది.
వివరాలు
కొత్త అప్పులు లేకుండానే..
దీంతో ఈ ఏడాది మొత్తం ఆర్థిక వృద్ధి అంచనాను ప్రభుత్వం 11.05 శాతానికి పెంచింది.
ప్రజలకు నగదు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కొత్తగా రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తోంది.
ఏఐ, టెక్నాలజీ రంగాల్లో వచ్చిన వృద్ధి కారణంగా ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, అదే నిధులను నగదు పంపిణీకి వినియోగించనున్నట్లు చెబుతోంది.
2027 కేంద్ర బడ్జెట్‌కు ఈ ఏడాది చివర్లో శాసనసభ ఆమోదం లభిస్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే లూనార్ న్యూ ఇయర్‌కు ముందే ప్రజలకు నగదు అందించే అవకాశం ఉంది.
ఈ నగదును ప్రజలు తమకు నచ్చిన విధంగా వినియోగించుకోవచ్చని అధ్యక్షుడు లై చింగ్-తే తెలిపారు.
వివరాలు
40 ఏళ్లలోనే అత్యధిక వృద్ధి?
పిల్లల విద్య, వృద్ధుల సంరక్షణ, కుటుంబ అవసరాలు లేదా వ్యక్తిగత షాపింగ్ వంటి వాటికి ఈ మొత్తాన్ని ఖర్చు చేసుకోవచ్చని ఆయన సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఏఐ బూమ్‌తో ఎక్కువగా లాభపడుతున్న దేశాల్లో తైవాన్ కూడా ఒకటిగా నిలిచింది.
ముఖ్యంగా అధునాతన చిప్స్,ఏఐ సర్వర్లు,క్లౌడ్ కంప్యూటింగ్ పరికరాల తయారీ,సరఫరాలో తైవాన్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ రంగాలకు పెరుగుతున్న డిమాండ్ దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తోంది.
ప్రస్తుత అంచనా ప్రకారం 2026లో తైవాన్ 11.05 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తే.. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఇదే అత్యధిక వృద్ధి రేటు కానుంది.
ఏఐ ఆధారిత పరిశ్రమల విస్తరణ ఈ వేగవంతమైన ఆర్థిక పురోగతికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది.
వివరాలు
రాజకీయంగా విమర్శలు
అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన నగదు పంపిణీపై రాజకీయ విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఇలాంటి నగదు పంపిణీ పథకాలను వ్యతిరేకించిన అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల కోసం తన వైఖరిని మార్చుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ విమర్శలను ప్రభుత్వం మరో విధంగా చూస్తోంది. ఏఐ ఆధారిత ఆర్థిక వృద్ధి వల్ల వచ్చే ప్రయోజనాలు కేవలం టెక్నాలజీ, సెమీకండక్టర్ వంటి కొన్ని రంగాలకే పరిమితం కాకుండా సాధారణ ప్రజలకు కూడా చేరాలన్నదే తమ ఉద్దేశమని అధ్యక్షుడు లై చింగ్-తే స్పష్టం చేశారు.