Donald Trump: 'తుపాను ముందు ప్రశాంతతే'.. ఏఐ ఫొటోతో ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. "తుపాను వచ్చే ముందు ప్రశాంతత ఉంటుందనే అర్థం వచ్చేలా ఓ ఏఐ రూపొందించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఆయన పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై వైమానిక దాడులను మళ్లీ ప్రారంభించే అంశంపై ట్రంప్ తన అధికార యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ ఆయన ఈ పోస్టు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో షేర్ చేసిన ఆ ఏఐ ఫొటోలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో పలు యుద్ధ నౌకలు ప్రయాణిస్తున్నట్లు చూపించారు.
వివరాలు
ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసే అవకాశం
అక్కడ ట్రంప్‌తో పాటు ఒక అమెరికా నేవీ అడ్మిరల్ కూడా కనిపించారు. సముద్రంలోని నౌకలపై ఇరాన్ జెండాలు ఉండటం ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆ ఫొటోకు "తుపానుకు ముందు ప్రశాంతత" అనే భావం వచ్చేలా క్యాప్షన్ జత చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, హోర్ముజ్ జలసంధి అంశంలో ఉద్రిక్తతలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్‌పై మళ్లీ దాడులు చేపట్టే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం రావడం, దానికి తోడు ట్రంప్ ఈ ఫొటోను పంచుకోవడం పరిస్థితులపై మరింత ఆందోళన పెంచుతోంది.
వివరాలు
తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం
ఇక ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ నేరుగా ఇరాన్‌ను హెచ్చరించారు. టెహ్రాన్ త్వరగా ఒక ఒప్పందానికి రావాలని, లేదంటే తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇరాన్‌తో తుది ఒప్పందం కుదురుతుందా లేదా అన్న విషయంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేనని పేర్కొన్న ట్రంప్, తమతో చర్చలకు రావడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.