Page Loader
USA: 30 రోజుల్లో దేశం ఖాళీ చేయాలి.. లేకపోతే జైలు శిక్ష తప్పదు! 
30 రోజుల్లో దేశం ఖాళీ చేయాలి.. లేకపోతే జైలు శిక్ష తప్పదు!

USA: 30 రోజుల్లో దేశం ఖాళీ చేయాలి.. లేకపోతే జైలు శిక్ష తప్పదు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఎక్కువకాలంగా నివసిస్తున్న విదేశీ పౌరులపై తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. 30 రోజులకు మించి అమెరికాలో ఉన్న వారంతా తప్పనిసరిగా ఫెడరల్ ప్రభుత్వం వద్ద తమ సమాచారం నమోదు చేయించుకోవాల్సిందేనని పేర్కొంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరంగా పరిగణించి అపరాధ రుసుం విధించడంతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పుడే స్వచ్ఛందంగా అమెరికా వదిలేయడం మేలు. మీ సామాను సర్దుకొని విమానంలో ఎక్కండి. మీకు నేరపూరిత చరిత్ర లేకపోతే, మీరు సంపాదించిన డబ్బును తీసుకొని వెళ్లొచ్చని అధికార సంస్థ 'ఎక్స్‌' ప్లాట్‌ఫామ్‌లో పేర్కొంది.

Details

ఆలస్యం చేస్తే భారీ జరిమానా

అంతేకాదు విమాన టికెట్‌ ధర భరించలేని వారికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ నిబంధనలు పాటించకపోతే, శిక్షలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ఫైనల్ డిపార్ట్చర్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్క రోజు ఆలస్యం చేసినా, రోజుకు 998 డాలర్ల ఫైన్ విధిస్తామని, స్వచ్ఛందంగా వెళ్లకుండా అరెస్ట్ చేస్తే 1,000 నుండి 5,000 డాలర్ల వరకు జరిమానా విధించి, జైలు శిక్షను కూడా అమలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు, ఈ చర్యల అనంతరం ఆయా వ్యక్తులకు భవిష్యత్తులో చట్టబద్ధంగా అమెరికాలోకి ప్రవేశించే అవకాశం దాదాపుగా ఉండదని స్పష్టం చేసింది.

Details

చట్టపరమైన చర్యలు తప్పవు

అయితే ఈ నియమాలు నేరుగా హెచ్‌1బీ వీసా, విద్యార్థి వీసాలపై ఉన్నవారికి వర్తించవని స్పష్టం చేసింది. అయితే, ఉద్యోగం కోల్పోయిన హెచ్‌1బీ వీసాదారులు లేదా విద్యార్థులు వీసా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్దేశిత సమయం మించి అమెరికాలో ఉంటే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న విదేశీయులు వీసా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలనీ, తమ నివాసాన్ని చట్టబద్ధంగా కొనసాగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలనీ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టంగా సూచించింది.