
Canada: అమెరికాతో పాత బంధానికి తెరపడింది.. కెనడా ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, సుంకాల పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పొరుగుదేశమైన కెనడా (Canada)తో తరచూ వివాదాలు సృష్టిస్తున్నారు.
ఇప్పటికే ఆ దేశ ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు విధించిన ఆయన, తాజాగా వాహన దిగుమతులపై 25శాతం సుంకాన్ని ప్రకటించారు.
ఈ నిర్ణయంపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Canada PM Mark Carney) తీవ్రంగా స్పందించారు.
ఈ చర్యతో ఇరుదేశాల మధ్య ఉన్న పాత బంధం పూర్తిగా ముగిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
Details
అమెరికా-కెనడా సంబంధాలకు గండి?
ట్రంప్ టారిఫ్ (Trump Tariffs) ప్రకటన వెలువడిన వెంటనే, తన ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించి, మార్క్ కార్నీ ఒట్టావాకు చేరుకుని కేబినెట్ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్యయుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ట్రంప్ విధించిన సుంకాలు పూర్తిగా అన్యాయమైనవని, ఈ చర్యల ద్వారా ఆయన ఇరుదేశాల మధ్య స్నేహబంధాన్ని శాశ్వతంగా మారుస్తున్నారని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు.
అమెరికా-కెనడా మధ్య ఉన్న వాణిజ్య, ఆర్థిక వ్యవస్థ, భద్రత, సైనిక సహకారం వంటి పాత బంధం నేటితో ముగిసిపోయిందన్నారు.
Details
తమ నిర్ణయాలు అగ్రరాజ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి
అమెరికా విధిస్తున్న ఈ టారిఫ్‌లను తాము ప్రతీకార వాణిజ్య చర్యల ద్వారా ఎదుర్కొంటామని, తమ నిర్ణయాలు అగ్రరాజ్యం అమెరికాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయన్నారు.
తమ దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు.