US Government Shuts Down: అమెరికాలో షట్‌డౌన్ ప్రారంభం.. అసలు షట్‌డౌన్ వెనుక ఉన్న అర్థమిదే?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మరికాసేపట్లో షట్‌డౌన్ ప్రారంభం కానుంది. దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత 2025 అక్టోబర్ 1న ET 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30) అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్తోంది. ఈ పరిణామానికి కారణం, ప్రభుత్వ ఖర్చులకు నిధులను సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలమవడం, 2018-19లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కీలక నిధుల బిల్లుకు ఆమోదం పొందలేక 35 రోజులు ప్రభుత్వ షట్‌డౌన్‌లోకి వెళ్లిన విషయం గుర్తుకొస్తోంది.
Details
కేవలం 55 ఓట్లు మాత్రమే లభ్యం
డొనాల్డ్ ట్రంప్ పార్టీ సెనేట్‌లో తాత్కాలిక నిధుల బిల్లుకు కనీసం 60 ఓట్లు అవసరమని భావించింది, కానీ కేవలం 55 ఓట్లు మాత్రమే లభించడంతో అవసరమైన నిధుల పొడిగింపు సాధ్యంకాలేదు. దీనిపై డెమోక్రటిక్ పార్టీ నేత చక్ షుమెర్ రిపబ్లికన్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రిపబ్లికన్లు అమెరికాను షట్‌డౌన్‌లోకి నెట్టారని ఆయన ఆరోపించారు. లక్షలాది అమెరికన్ కుటుంబాలు తమ బిల్లులు చెల్లించేందుకు మార్గాలు వెతుకుతూ ఆందోళన చెందుతున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు రిపబ్లికన్లను దీనికి బాధ్యులుగా భావిస్తారని హెచ్చరించారు.
Details
అమెరికా షట్‌డౌన్ అంటే ఏమిటి?
సాధారణంగా ప్రభుత్వ విభాగాలు పనిచేయడానికి, సేవలను కొనసాగించడానికి భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయి. అమెరికాలో ఈ నిధులను సమకూర్చడానికి కాంగ్రెస్ బడ్జెట్ లేదా నిధుల బిల్లును ఆమోదించాలి. అయితే రాజకీయ విభేదాలు లేదా ప్రతిష్టంభన కారణంగా నిర్ణీత గడువులో నిధుల బిల్లును ఆమోదించలేకపోతే ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఖర్చు చేయడానికి నిధులు లభించవు. ఇలాంటి పరిస్థితిలో, అవసరంకాని ప్రభుత్వ సేవలను నిలిపివేయవలసి వస్తుంది. నిధులు ఆమోదం పొందేవరకు కొన్ని ప్రభుత్వ విభాగాలు, సేవలు మూసివేయబడతాయి.
Details
జీతం లేకుండా పని చేయాల్సి వస్తుంది
షట్‌డౌన్ సమయంలో అనేక వేల ఫెడరల్ ఉద్యోగులు జీతం లేకుండా సెలవుపై పంపబడతారు, కొంతమంది జీతం లేకుండా పని చేయవలసి వస్తుంది. ఈ సారి షట్‌డౌన్ ముప్పు మరింత తీవ్రమని అంచనా వేస్తున్నారు. ట్రంప్ దీన్ని ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించి, లక్షలాది ఉద్యోగులను తొలగించవచ్చని, అనేక కీలక ప్రాజెక్టులను నిలిపివేయవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో సాధారణ ప్రజల జీవితంలో, ప్రభుత్వ సేవలందించడంలో తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది.