స్కూళ్లు, కాలేజీల్లో బాలికల నిషేధంపై మాటమార్చిన తాలిబాన్లు
అఫ్గానిస్థాన్‌లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో బాలికల విద్యపై తాలిబాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బాలికల విద్యను శాశ్వతంగా నిషేధించలేదని చెప్పింది. తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొంది. 2022 డిసెంబర్‌లో యువతుల ఉన్నత విద్యపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు బాలికలు, యువతులను కళాశాల, విశ్వవిద్యాలయాలకు వెళ్లకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలో 6వ తరగతి తర్వాత విద్యను అభ్యసించే బాలికలు, యువతులు పూర్తిగా చదువుకు దూరం కావాల్సి వచ్చింది. అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మహిళలు, యువతులపై అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి.
అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పిన తాలిబన్లు
తాలిబాన్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో దేశంలోనే కాకుండా అంతర్జాతీయం కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో తాలిబాన్ ప్రభుత్వం తన నిర్ణయంపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. దేశంలో మహిళలు, యువతుల విద్యపై శాశ్వత నిషేధం విధించలేదని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ చెప్పారు. వారి విద్యకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే వరకు వాయిదా మాత్రమే వేసినట్లు వేసినట్లు పేర్కొన్నారు. మహిళలు, యువతుల విద్యకు వీలైనంత త్వరగా అనుకూలమైన పరిస్థితిని సాధించడానికి కృష్టి చేస్తున్నట్లు సుహైల్ షాహీన్ చెప్పారు. మహిళల విద్యకు తాము వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు.