Loading...
H1B VISA: హెచ్‌ 1బీ ఫీజుల సవరణకు వైట్‌హౌస్‌ ఆమోదం
హెచ్‌ 1బీ ఫీజుల సవరణకు వైట్‌హౌస్‌ ఆమోదం

H1B VISA: హెచ్‌ 1బీ ఫీజుల సవరణకు వైట్‌హౌస్‌ ఆమోదం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 23, 2026
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్‌1బీ వీసా పిటిషన్‌ ఫీజులను సవరించేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనపై వైట్‌హౌస్‌ సమీక్ష పూర్తయింది. రాబోయే కొన్ని వారాల్లో ఈ ప్రతిపాదనకు సంబంధించిన పూర్తి ముసాయిదాను ప్రభుత్వం ప్రజల పరిశీలనకు విడుదల చేయనుంది. ముందుగా ప్రతిపాదనను అధికారికంగా ప్రచురించి.. ప్రజలు, సంస్థల నుంచి సలహాలు, అభిప్రాయాలను స్వీకరించనుంది. ఈ పరిణామం భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా జారీ చేసే హెచ్‌1బీ వీసాలు, ఉద్యోగాల పొడిగింపుల్లో భారతీయులదే సింహభాగం.

వివరాలు

78 శాతం భారతీయులకే..

అధికారిక గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో పొడిగించిన మొత్తం హెచ్‌1బీ ఉద్యోగాల్లో దాదాపు 78 శాతం భారతీయులకే దక్కాయి.

దీంతో హెచ్‌1బీ వీసా పిటిషన్‌ ఫీజులను పెంచితే.. భారతీయ ఐటీ నిపుణులను నియమించుకునే అమెరికా సంస్థలకు దరఖాస్తు ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం పాత ఫీజులే కొనసాగుతున్నప్పటికీ.. భవిష్యత్తులో విదేశీ నిపుణులను నియమించుకోవడం అమెరికా కంపెనీలకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి.

వివరాలు

75 దేశాల వీసా నిషేధాన్ని కొట్టివేసిన అమెరికా కోర్టు..

75 దేశాలకు చెందిన దరఖాస్తుదారులకు ఇమ్మిగ్రెంట్‌ వీసాల జారీని నిలిపివేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని అమెరికా న్యాయమూర్తి కొట్టివేశారు.

ఈ విధానం విదేశాంగ మంత్రి మార్కో రూబియోకున్న చట్టబద్ధమైన అధికార పరిధిని మించిపోయిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

న్యూయార్క్‌ సదరన్‌ డిస్ట్రిక్ట్‌లోని మాన్‌హాటన్‌ న్యాయమూర్తి జానెట్‌ వర్గాస్‌ శుక్రవారం ఇచ్చిన తీర్పులో ఈ విధానం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

అలాగే కాన్సులర్‌ అధికారుల ఇమ్మిగ్రేషన్‌ వీసా నిర్ణయాలపై విదేశాంగ మంత్రికి ఉన్న అధికారాన్ని స్పష్టంగా తొలగించిన సమాఖ్య ఇమ్మిగ్రేషన్‌ చట్టానికి ఈ విధానం విరుద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

ADVERTISEMENT