LOADING...
Iran on US: ఇరాన్ సమస్యకు సైనిక పరిష్కారం లేదు.. దౌత్యమే మార్గం: అబ్బాస్ అరాగ్చీ
ఇరాన్ సమస్యకు సైనిక పరిష్కారం లేదు.. దౌత్యమే మార్గం: అబ్బాస్ అరాగ్చీ

Iran on US: ఇరాన్ సమస్యకు సైనిక పరిష్కారం లేదు.. దౌత్యమే మార్గం: అబ్బాస్ అరాగ్చీ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2026
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌కు సంబంధించిన సమస్యలకు సైనిక పరిష్కారం సాధ్యం కాదని, దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాలంటే యూఎస్ తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇరాన్ ప్రజలు గౌరవప్రదమైన భాషకే స్పందిస్తారని, ఒత్తిళ్లు, బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గబోమని తేల్చిచెప్పారు. దిల్లీలో జరిగిన బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన అరాగ్చీ.. ఇరాన్-అమెరికా మధ్య దౌత్య చర్చలు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం పరస్పర నమ్మకం లోపించడమేనని వ్యాఖ్యానించారు. అమెరికా తమను పూర్తిగా విశ్వసించవచ్చని, కానీ అమెరికాను నమ్మకపోవడానికి తమ వద్ద అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. ఇదే చర్చలకు అతిపెద్ద అడ్డంకిగా మారిందన్నారు.

వివరాలు

ఏ దేశం ముందుకొచ్చినా శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇస్తాం

ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా పలు మార్గాల్లో ప్రయత్నించిందని అరాగ్చీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనలో ఇండియా కీలక పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశగా భారత్ ఎలాంటి ప్రయత్నం చేసినా తమ దేశం స్వాగతిస్తుందని తెలిపారు. అలాగే చైనా సహా ఏ దేశం ముందుకు వచ్చినా శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని చెప్పారు. హర్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఇప్పటికీ క్లిష్టంగానే ఉన్నాయని అరాగ్చీ వెల్లడించారు. అయితే ఇరాన్‌తో ప్రత్యక్షంగా తలపడుతున్న దేశాలకు చెందిన నౌకలు తప్ప మిగతా అన్ని దేశాల నౌకలకు హర్మూజ్ జలసంధి తెరిచే ఉందని స్పష్టం చేశారు. యుద్ధ పరిస్థితులు సానుకూలంగా ముగిస్తే పరిస్థితులన్నీ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement