LOADING...
Delhi Bomb Blast: 'భారత్ కు మా సహాయం అవసరం లేదు': మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు 
'భారత్ కు మా సహాయం అవసరం లేదు': మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

Delhi Bomb Blast: 'భారత్ కు మా సహాయం అవసరం లేదు': మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై భారత భద్రతా సంస్థలు వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఈ పరిణామంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు ప్రక్రియలో సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, భారత ప్రభుత్వానికి ఆ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం కెనడాలో జరిగిన జీ-7 (G7) విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం రూబియో మీడియాతో మాట్లాడారు. దిల్లీ పేలుడు ఘటనపై భారత్‌కు తమ వంతు సహాయం అందించాలనుకున్నామని, కానీ భారత అధికారులు స్వయంగా అత్యుత్తమ వృత్తి నైపుణ్యంతో దర్యాప్తు జరుపుతున్నారని ఆయన అన్నారు.

వివరాలు 

జైశంకర్‌-రూబియో సమావేశం 

ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కూడా పాల్గొన్నారు. జైశంకర్‌-రూబియో సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలతో పాటు దిల్లీ పేలుడు అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం జైశంకర్‌ తన ఎక్స్‌ (X) ఖాతాలో రూబియోతో జరిగిన సమావేశంపై పోస్టు చేశారు. గత సోమవారం ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత భద్రతా విభాగాలు అప్రమత్తం అయ్యాయి. నిందితులను గుర్తించేందుకు విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే పలు ముఖ్య ఆధారాలు బయటపడ్డాయని సమాచారం.

వివరాలు 

అమెరికా రాయబార కార్యాలయం సంతాపం

ఈ కేసు విచారణ కోసం ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 10 మంది నిపుణులతో ఈ దర్యాప్తు బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో డాక్టర్‌ ఉమర్‌ నబీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పేలుడులో ఆయన కూడా మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం తెలిపింది. ఇక ఘటనపై అమెరికా రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. "దిల్లీలో జరిగిన భయానక పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ఈ బాధ నుంచి వారు త్వరగా బయటపడాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.