Zelenskyy: ఇరాన్ డ్రోన్ల ముప్పు.. గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ సైనిక నిపుణుల సాయం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ తయారుచేస్తున్న డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్ సాయం కోరుతున్నాయని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ క్రమంలో సుమారు 200 మందికి పైగా ఉక్రెయిన్ సైనిక నిపుణులు ఇప్పటికే పశ్చిమాసియా దేశాలకు వెళ్లి అక్కడి ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. త్వరలో మరికొంతమంది నిపుణులను కూడా పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మంగళవారం యూకే పర్యటనలో భాగంగా బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగిస్తూ జెలెన్‌స్కీ ఈ విషయాలను వెల్లడించారు. 2022నుంచి కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వినియోగిస్తున్న పలు రకాల డ్రోన్లను తమ సైన్యం సమర్థంగా ఎదుర్కొంటోందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
Details
తమ సొంత భాగాలతో మరింత అభివృద్ధి
ముఖ్యంగా ఇరాన్ తయారు చేసిన కామికాజీ డ్రోన్లు, షాహెద్-136 డ్రోన్లు పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అదే రకమైన డ్రోన్లను టెహ్రాన్ గల్ఫ్ దేశాలపై కూడా ప్రయోగిస్తోందని ఆయన అన్నారు. వాటిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బృందాలు ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఇప్పటికే సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు. షాహెద్-136 డ్రోన్లను రష్యా ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుందని, వాటి వినియోగంపై కూడా ఇరాన్ నుంచి శిక్షణ పొందిందని జెలెన్‌స్కీ చెప్పారు. అంతేకాకుండా ఈ డ్రోన్ల తయారీ సాంకేతికతను కూడా టెహ్రాన్ మాస్కోకు అందించిందని తెలిపారు. అనంతరం రష్యా వాటిని తమ సొంత భాగాలతో మరింత అభివృద్ధి చేసిందని వివరించారు.
Details
ఉక్రెయిన్ వేగంగా పురోగతి సాధిస్తోంది
డ్రోన్లను ఎదుర్కోవడమే కాకుండా వాటి తయారీలో కూడా ఉక్రెయిన్ వేగంగా పురోగతి సాధిస్తోందని జెలెన్‌స్కీ చెప్పారు. యుద్ధంలో రష్యాకు కలుగుతున్న నష్టాల్లో సుమారు 90 శాతం తమ దేశం అభివృద్ధి చేసిన ఆధునిక డ్రోన్ల వల్లేనని పేర్కొన్నారు. అత్యాధునిక డ్రోన్ ఇంటర్‌సెప్టర్‌ల తయారీలో ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఉక్రెయిన్ స్థానం సంపాదించిందని ఆయన స్పష్టం చేశారు.