Video: చావుతో చెలగాటం.. సెల్‌ఫోన్ కోసం జలపాతంలోకి దూకిన టూరిస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
సెల్‌ఫోన్ కోసం ఓవ్యక్తి చేసిన సాహసం అక్కడున్న వారిని ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. కాస్త ఏమరుపాటుగా వ్యవహరించి ఉంటే అతడు క్షణాల్లోనే వందల అడుగుల లోతులోకి కొట్టుకుపోయే ప్రమాదం ఉండేది. అతడి చర్యను చూసిన పర్యాటకులు ఊపిరి బిగబట్టి చూస్తుండగా,చివరకు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంతటి ప్రాణాపాయ సాహసం వెనుక కారణం సెల్‌ఫోన్ అని తెలిసి మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇగ్వాజు జలపాతం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అర్జెంటీనా-బ్రెజిల్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఈ జలపాతం ప్రపంచంలోని అతిపెద్ద జలపాత వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సుమారు 262అడుగుల లోతుతో ఉండే ఈప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు.
వివరాలు
వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇతర పర్యాటకులు
శనివారం (జూన్ 6) బ్రెజిల్ వైపు ఉన్న జలపాతం ప్రాంతంలో ఓ పర్యాటకుడు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగాడు. రాళ్లపై నుంచి జాగ్రత్త లేకుండా ప్రవాహంలోకి వెళ్లి ఏదో వెతకడం ప్రారంభించాడు. అక్కడ నీటి వేగం అధికంగా ఉండటంతో పాటు రాళ్లు చాలా జారుడుగా ఉంటాయి. మరోవైపు కేవలం కొద్ది అడుగుల దూరంలోనే ప్రాణాంతక లోతు ఉండటంతో అధికారులు ఈ ప్రాంతంలో కఠిన భద్రతా నిబంధనలు అమలు చేస్తుంటారు. అయినప్పటికీ ఆ వ్యక్తి వాటిని పట్టించుకోకుండా సాహసానికి ఒడిగట్టాడు. కొంతసేపు నీటిలో ఏదో వెతికిన అతడు ఆలస్యం చేయకుండా బయటకు వచ్చేశాడు. ఈ మొత్తం ఘటనను అక్కడున్న ఇతర పర్యాటకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.
వివరాలు
పర్యాటకుల నిర్లక్ష్య వైఖరిపై మరోసారి చర్చ
ప్రాథమిక సమాచారం ప్రకారం, అతడి సెల్‌ఫోన్ జారిపడి నీటిలో పడిపోవడంతో దాన్ని వెతికేందుకు ఇలా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రవాహంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే అతనికి ఫోన్ దొరికిందా లేదా అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఆ పర్యాటకుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ సంఘటనతో ఇగ్వాజు జలపాతం ప్రాంతంలోని భద్రతా నిబంధనలు, పర్యాటకుల నిర్లక్ష్య వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది.
వివరాలు
టోపీ కోసం ప్రమాదకర ప్రాంతంలోకి..
ఇలాంటి ఘటనలు అక్కడ కొత్తేమీ కాదని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఓ పర్యాటకుడు తన టోపీ కోసం ప్రమాదకర ప్రాంతంలోకి వెళ్లగా, అధికారులు వెంటనే స్పందించి అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయినప్పటికీ కొందరు పర్యాటకులు ప్రాణాల కంటే వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఆందోళన కలిగిస్తోందని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చావు నోట్లో తలపెట్టి.. సెల్‌ఫోన్ కోసం చేసిన సాహసం వైరల్
🚨 #Viral | ¡De no creer! Un turista arriesgó su vida en las Cataratas del Iguazú tras saltar al agua en plena Garganta del Diablo para recuperar su celular. Cruzó las vallas de seguridad y desafió la fuerte corriente. ⚠️📱👇 pic.twitter.com/rp6XoaNjBf
— Vanguardia (@vanguardiacom) June 8, 2026