
India-USA: 'వాణిజ్య చర్చలు బాగా జరుగుతున్నాయి': భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందం త్వరలో కుదిరే అవకాశం: డోనాల్డ్ ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తంచేశారు.
ప్రస్తుతం అమెరికా భారత్‌పై దాదాపు 26 శాతం వరకూ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇరు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
వైట్‌హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, "భారత్‌తో టారిఫ్ చర్చలు చాలా సానుకూలంగా సాగుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు సుంకాల విషయంపై ఒక స్పష్టమైన ఒప్పందానికి రావాలనే అభిప్రాయంతో ముందడుగు వేశారు. అది త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని భావిస్తున్నాను," అని తెలిపారు.
వివరాలు
భారత్ వంటి సానుకూల వైఖరి కలిగిన దేశాలతో చర్చలు జరపడం ఎంతో సులభం
ఇదే విషయమై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కూడా స్పందిస్తూ,భారత్-అమెరికాల మధ్య టారిఫ్ చర్చలు గణనీయంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
ఇందులో భాగంగా త్వరలోనే న్యూఢిల్లీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందన్నారు.
అంతేకాక,భారత్ వంటి సానుకూల వైఖరి కలిగిన దేశాలతో చర్చలు జరపడం ఎంతో సులభంగా ఉంటుందన్నారు.
అంతేకాక, అమెరికా వాణిజ్య విభాగానికి చెందిన కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, తమ వద్ద ఇప్పటికే ఒక వాణిజ్య ఒప్పందం సిద్ధంగా ఉందని కానీ దానికి సంబంధిత దేశ ప్రధాని, పార్లమెంటు అంగీకారం అవసరమని వివరించారు.
అయితే, ఆయన పేర్కొన్న దేశం ఏదో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, అది భారత్ కావచ్చని భావిస్తున్నారు.
వివరాలు
రెండు దేశాల మధ్య సహకారంతో వాణిజ్య ఒప్పందం
ఈ నెల ప్రారంభంలో అమెరికా అనేక దేశాలపై అధిక సుంకాలు విధించడంతో అనేక దేశాలు ప్రతీకార చర్యలకు దిగాయి.
అయితే భారత్ మాత్రం భిన్నంగా స్పందించి, ప్రతిస్పందన చర్యలకంటే రెండు దేశాల మధ్య సహకారంతో వాణిజ్య ఒప్పందం కుదిర్చుకోవాలన్న దిశగా కసరత్తు ప్రారంభించింది.
ప్రధాని మోదీ ఇటీవల చేసిన అమెరికా పర్యటన సమయంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య సహకారం పెంపు కోసం ప్రారంభించిన చర్చలు ప్రస్తుతం సానుకూల దిశగా కొనసాగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దేశాధినేతలు పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యారని పేర్కొనడం గమనార్హం.