
Congo boat accidents: కాంగోలో ఘోర విషాదం.. రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు పడవ ప్రమాదాలు 193 మందిని బలి తీసుకున్నాయి. ఈ ఘటనల్లో మరికొందరు గల్లంతయ్యారని ఆ దేశ అధికారులు, స్థానిక మీడియా వెల్లడించాయి. ఈక్వెటార్ ప్రావిన్స్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో బుధవారం, గురువారం ఈ ప్రమాదాలు సంభవించాయి. అధికారుల వివరాల ప్రకారం, గురువారం సాయంత్రం లుకోలెలా ప్రాంతం నుంచి సుమారు 500 మందితో బయలుదేరిన ఓ పడవలో ప్రయాణమధ్యలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఆ పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 107 మంది మృతిచెందారని కాంగో ప్రభుత్వం ప్రకటించింది.
Details
146 మంది గల్లంతైనట్లు సమాచారం
మొత్తం 209 మందిని రక్షించగా, మలాంగే గ్రామానికి చెందిన మరొక పడవ సహాయంతో పలువురు ఒడ్డుకు చేరినట్లు సమాచారం. ప్రభుత్వ నివేదిక ప్రకారం, 146 మంది గల్లంతయ్యారని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇక బుధవారం బసాన్‌కుసు ప్రాంతంలో మరో పడవ బోల్తా పడిన ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో 86 మంది మరణించారు. వారిలో ఎక్కువమంది విద్యార్థులేనని సమాచారం. ఇంకా కొంతమంది గల్లంతైనప్పటికీ, వారి సంఖ్యను స్పష్టంగా తెలియజేయలేదు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు.
Details
అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదాలు
అయితే లోడింగ్, నావిగేషన్ వ్యవస్థలో లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారిక మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ప్రమాదాలకు కారణమని పౌర సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. విస్తారమైన వర్షారణ్యాలతో కూడిన కాంగోలో నదీ రవాణా ప్రజల జీవనాడిగా ఉంటుంది. రోడ్డు రవాణా కంటే చవకగా ఉండటం వల్ల గ్రామాల మధ్య పాత చెక్క పడవల్లోనే ఎక్కువగా రాకపోకలు సాగుతుంటాయి. అయితే ఈ పడవల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.