Dominican Republic: డొమినికన్ రిపబ్లిక్‌లో విషాదం.. రన్‌వేపై కూలి పేలిపోయిన ప్రైవేట్ విమానం
ఈ వార్తాకథనం ఏంటి
డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. హిగువే నగర పరిధిలోని లా రోమనా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాలో నమోదైన ఓ ప్రైవేట్ బిజినెస్ జెట్ అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ అక్కడికక్కడే సజీవదహనమైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం ప్రకారం, లా రోమనా ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సురక్షితంగా దించేందుకు పైలట్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు. ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయిన బిజినెస్ జెట్ రన్‌వే పక్కకు దూసుకెళ్లి క్షణాల్లోనే భారీ శబ్దంతో పేలిపోయింది. ప్రమాదం అనంతరం విమానంలోని ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించి విమానం పూర్తిగా నిప్పుల ముద్దగా మారింది.
వివరాలు
దర్యాప్తు ప్రారంభించిన అధికారులు
ఈప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానం మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమవుతున్న వీడియోలు నెటిజన్లను కలవరపెడుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్ ఫైర్‌ఫైటర్లు, అత్యవసర రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రసాయన ఫోమ్, నీటిని ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. అయితే అప్పటికే విమానం పూర్తిగా ధ్వంసమైపోవడంతో లోపల చిక్కుకున్న పైలట్, కో-పైలట్‌లను రక్షించడం సాధ్యపడలేదు. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై డొమినికన్ రిపబ్లిక్ విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులు లేదా ఇతర అంశాలు ప్రమాదానికి దారితీశాయా అనే కోణాల్లో విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు.