
Harvard University: మరోసారి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మరో 450 మిలియన్ గ్రాంట్ల కోత
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటికే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఫెడరల్ నిధుల్ని నిలిపివేసినట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నిధుల మొత్తంలో భాగంగా ఉన్న 450 మిలియన్ డాలర్ల గ్రాంట్‌ను నిలిపివేస్తూ, ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం తాజాగా మరో కీలక చర్యను తీసుకుంది.
హార్వర్డ్ యూనివర్సిటీ ఉధారవాదానికి కేంద్రంగా మారిందని, యూదు వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహిస్తోందని అమెరికా ప్రభుత్వం చేసిన ఆరోపణల్ని, హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ ఖండించిన మరుసటి రోజే ఈ నిధులు నిలిపివేయడం గమనార్హం.
వివరాలు
హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ప్రభుత్వంపై కోర్టులో కేసు
ఈ వ్యవహారంపై స్పష్టత ఇస్తూ.. అమెరికా ప్రభుత్వం ఆరోగ్య, మానవ సేవల విభాగం ద్వారా అందించాల్సిన 450 మిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లను నిలిపివేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
ఇదే సమయంలో గతంలో నిలిపివేసిన 2.2 బిలియన్ డాలర్ల నిధులకు ఇది అదనంగా చేర్చబడుతోందని తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ప్రభుత్వంపై కోర్టులో కేసు వేసింది. తమ కార్యకలాపాల్లో ప్రభుత్వం చట్ట విరుద్ధంగా జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది.
తాము ఏ రాజకీయ ఆలోచనలను అనుసరించకుండా, విద్యార్థుల ఎంపికలో జాతి ఆధారంగా కాకుండా వారి ప్రతిభ, సామర్థ్యం, ప్రత్యేకతల ఆధారంగా ఎంపిక చేస్తామని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ స్పష్టంగా తెలిపారు.
సోమవారం ఆయన ఈ విషయాన్ని మీడియాకు వివరించారు.
వివరాలు
హార్వర్డ్‌కు విదేశీ విద్యార్థుల ప్రవేశ అర్హతను రద్దు
ఇదిలా ఉండగా, విదేశీ విద్యార్థుల సంబంధిత సమాచారం విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీకి వైట్‌హౌస్ తాజాగా కొన్ని గట్టి షరతులను విధించింది.
అక్రమంగా లేదా హింసాత్మకంగా ప్రవర్తించిన విదేశీ విద్యార్థుల వివరాలను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులకు ప్రవేశం కల్పించేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది.
లేకపోతే హార్వర్డ్‌కు విదేశీ విద్యార్థుల ప్రవేశ అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఇక విశ్వవిద్యాలయంలో జాతి వివక్షకు సంబంధించిన ఫిర్యాదులపై ఫెడరల్ అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
వివరాలు
ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని హార్వర్డ్ యూనివర్సిటీ స్పష్టం
ఈ మొత్తం వ్యవహారంపై హార్వర్డ్ యూనివర్సిటీ అధికారికంగా స్పందిస్తూ, ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
తమ స్వాతంత్ర్యం, రాజ్యాంగ హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని హార్వర్డ్ స్పష్టం చేసింది.
తాము చట్టాలను పాటిస్తూ నడుచుకుంటున్నామనీ, ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే మేరకు వ్యవహరించాలని కోరింది.
ఈ నేపధ్యంలో గతంలో విధించిన 2.2 బిలియన్ డాలర్ల నిధుల కోతకు తోడు, ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు మరోసారి భారీగా నిధుల పరంగా కోత విధించడం గమనార్హం.