visa appointments: ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న అనూహ్య నిర్ణయం వీసా దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేయడంతోపాటు, ఇప్పటికే షెడ్యూల్ చేసిన కొన్ని ఇంటర్వ్యూలను కూడా రద్దు చేసి కొత్త తేదీలకు మార్చుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
వివరాలు
అపాయింట్‌మెంట్ ఖరారైన కొంతమంది దరఖాస్తుదారుల ఇంటర్వ్యూల రీషెడ్యూల్
అయితే ఈ నిర్ణయం వెనుక కొత్త ఇమిగ్రేషన్ విధానాన్ని అమలు చేయడమే కాకుండా.. అమెరికా విదేశాంగశాఖ చేపట్టిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు,కాన్సులేట్‌లలో కాన్సులర్ అధికారులకు శిక్షణ ప్రారంభించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది.
ఈశిక్షణకు అనుగుణంగా వీసా సేవల అపాయింట్‌మెంట్లను సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపింది.
అయితే ఈ మార్పులు ఎంతకాలం కొనసాగుతాయనే దానిపై స్పష్టమైన గడువును మాత్రం ప్రకటించలేదు.
ఇప్పటికే అపాయింట్‌మెంట్ ఖరారైన కొంతమంది దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు రీషెడ్యూల్ చేస్తున్నట్లు సమాచారం అందింది.
వారికి కొత్త తేదీ,సమయాన్ని తర్వాత తెలియజేయనున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.
తాజా పరిణామంతో అమెరికా వెళ్లేందుకు వీసా ప్రక్రియలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులు,ఇతర దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది.
వివరాలు
కాన్సులర్ అధికారులకు శిక్షణ
ఈ శిక్షణలో వీసా దరఖాస్తుదారుల పరిశీలనను మరింత కఠినంగా, ఒకే విధానంలో నిర్వహించడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
ముఖ్యంగా అమెరికాలో ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను గుర్తించేలా కాన్సులర్ అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న విస్తృత ఇమిగ్రేషన్ కట్టడి చర్యల్లో భాగంగానే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.