LOADING...
US: అమెరికా విద్యార్థుల వీసా నిబంధనలపై కొత్త మార్పులు.. విదేశీ విద్యార్థుల కోసం పరిమిత కాల గడువు విధింపు
విదేశీ విద్యార్థుల కోసం పరిమిత కాల గడువు విధింపు

US: అమెరికా విద్యార్థుల వీసా నిబంధనలపై కొత్త మార్పులు.. విదేశీ విద్యార్థుల కోసం పరిమిత కాల గడువు విధింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే సోషల్ మీడియా వెట్టింగ్‌ ద్వారా వీసాల జారీపై కఠిన నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. తాజాగా, అమెరికా ప్రభుత్వం మరో కీలక మార్పును ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థులు (US Student Visa), ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు, మీడియా ప్రతినిధుల కోసం జారీ చేసే వీసాలకు గరిష్ఠ కాల పరిమితి విధించడానికి ప్రతిపాదనలు రూపొందించబడ్డాయి. దీని ప్రకారం, ఇకనుంచి విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉండలేరు.

వివరాలు 

 ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా విధానంలో మార్పులు 

ప్రస్తుతం ఎఫ్‌-1 వీసా కలిగిన అంతర్జాతీయ విద్యార్థులు, జే-1 వీసా కలిగిన ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు 'డ్యూరేషన్ ఆఫ్ స్టే' అనుమతితో చదువుకునే లేదా ఇంటర్న్‌షిప్‌/ప్రోగ్రామ్‌లో పాల్గొనేంతకాలం అమెరికాలో ఉండవచ్చు. ఈ సదుపాయం విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్ట్‌లు, ట్రైనీలు, ఇంటర్న్‌లు, ఫిజీషియన్లకు వర్తిస్తుంది. అయితే, ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా విధానంలో మార్పులు తీసుకురావడానికి ఇప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం, వీసాలకు గరిష్ఠ కాల గడువు విధించేలా 'పరిమిత కాల నివాస అనుమతి' కలిగిన వీసాలు జారీ చేయాలని నిర్ణయించారు.

వివరాలు 

హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రతిపాదన

"విదేశీ విద్యార్థులు, ఇతర వీసాదారులు అమెరికాలో నిరవధికంగా నివసించేలా చాలాకాలంగా గత ప్రభుత్వాలు అనుమతి కల్పించాయి.దీని కారణంగా భద్రతా సమస్యలు, అలాగే అమెరికా ప్రజలకు కలిగే ప్రయోజనాలను నష్టపరిచే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల, కొత్త నిబంధనలను ప్రతిపాదించడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపుతున్నాం. కొన్ని రకాల వీసాదారుల గరిష్ఠ నివాస కాలాన్ని పరిమితం చేయడం ద్వారా ఫెడరల్ ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తగ్గుతుంది" అని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రతిపాదనలో పేర్కొంది.

వివరాలు 

ప్రతిపాదనలో సూచించిన ముఖ్య మార్పులు:

1. ఎఫ్‌-1, జే-1 వీసా పొందిన విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు అమెరికాలో చదువుకునే గరిష్ఠ కాల పరిమితి నాలుగు సంవత్సరాలుగా నిర్ణయించబడింది. 2. గ్రాడ్యుయేట్‌ స్థాయి ఎఫ్‌-1 విద్యార్థులు కోర్సు మధ్యలో మార్పులు చేసుకుంటే, ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 3. ఎఫ్‌-1 విద్యార్థులు చదువు ముగించిన తర్వాత వేరే వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ఇప్పటికే ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను 30 రోజులకు తగ్గించారు. 4. విదేశీ మీడియా ప్రతినిధులు (I వీసా) 240 రోజుల వరకు అమెరికాలో ఉండవచ్చు. తరువాత, మరో 240 రోజుల పాటు నివాసం పొడిగించుకోవడానికి అవకాశం ఉంది. 5. దేశ భద్రతా కారణాల వల్ల, చైనీస్ మీడియా ప్రతినిధులపై అదనపు ఆంక్షలు విధించబడతాయి.

వివరాలు 

ప్రతిపాదనలపై 30 లేదా 60 రోజుల వరకు ప్రజాభిప్రాయాల స్వీకరణ 

అయితే, వీసా గడువు ముగిసిన తర్వాత విద్యార్థులు వీసాను పొడిగించడానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా, లేదా అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఈ ప్రతిపాదనలు అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించబడతాయి. ప్రచురణ తర్వాత, ప్రజాభిప్రాయాలు 30-60 రోజుల వ్యవధిలో స్వీకరించి తుది నిర్ణయం తీసుకోవడమే ఉద్దేశం. కొన్నిసార్లు, ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ప్రతిపాదనలు తక్షణమే అమల్లోకి రావడం కూడా సాధ్యం. ఈ మార్పులు అమల్లోకి వస్తే, ప్రధానంగా భారతీయ విద్యార్థులపై ప్రభావం పడే అవకాశముంది. ప్రస్తుతం, 3.3 లక్షల మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాలలో చదువుతున్నారు.