US Elections: పెన్సిల్వేనియాలో ఓటింగ్ ప్రక్రియపై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఆరోపణలు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ సమయంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. అతిపెద్ద నగరమైన పెన్సిల్వేనియాలో ఓటింగ్ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు. పెన్సిల్వేనియాలో అనూహ్యంగా అధిక ఓటర్లు ఉన్నారనే కథనాలు అక్కడి మీడియా సంస్థల్లో వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "పెన్సిల్వేనియాలో భారీ మోసం జరుగుతుందని చర్చలు సాగుతున్నాయి. చట్టం అమలులోకి వస్తోంది!" అని ట్రూత్ సామాజిక మాధ్యమంలో రాశారు. మరోవైపు ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని రిపబ్లికన్ సిటీ కమిషనర్ సేథ్ బ్లూస్టెయిన్ తెలిపారు. ఈ ఆరోపణలను తప్పుడు సమాచార వ్యాప్తికి ఉదాహరణగా అభివర్ణించారు. అలాగే పెన్సిల్వేనియాలో ఓటింగ్ సక్రమంగా సాగుతోందని వివరించారు.
1 శాతం ఓట్ల తేడాతో ట్రంప్ ఓటమి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలంటే పెన్సిల్వేనియాలో గెలవాల్సిన అవసరం ఉంది. 2016 ఎన్నికల్లో కేవలం 1 శాతం ఓట్లతో ట్రంప్ విజయం సాధించగా, అదే 1 శాతం ఓట్ల తేడాతో 2020 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.