Donald Trump: గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ యూటర్న్.. సుంకాల బెదిరింపులకు బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగానికి పాల్పడబోమని ఇప్పటికే దావోస్ వేదికగా స్పష్టం చేసిన ట్రంప్,తాజాగా సుంకాల విషయంలో కూడా వెనక్కి తగ్గారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రెట్టేతో జరిగిన ద్వైపాక్షికసమావేశం అనంతరం ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వని యూరోపియన్ యూనియన్ దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. మార్క్ రెట్టేతో జరిగిన చర్చలు ఎంతో ఫలప్రదంగా సాగాయని,గ్రీన్‌లాండ్‌తో పాటు ఆర్కిటిక్ ప్రాంత భవిష్యత్తుపై ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందానికి రూపకల్పన చేసినట్లు ట్రంప్ తెలిపారు.
వివరాలు
'గోల్డెన్ డోమ్' నిర్మాణంపై కూడా చర్చలు
ఈ ఒప్పందం అమలులోకి వస్తే అమెరికాతో పాటు నాటో మిత్ర దేశాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. అందుకే ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన సుంకాలను విధించబోమని స్పష్టం చేశారు. అలాగే గ్రీన్‌లాండ్‌కు సంబంధించి 'గోల్డెన్ డోమ్' నిర్మాణంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ఈ అంశంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్‌లు చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్ముస్సేన్ స్వాగతించారు. సుంకాలను విధించకపోవడం చాలా సానుకూల పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.