Loading...
Trump: 'మీకు ఇప్పటికే భారీ లాభాలు వచ్చాయి.. ఇక ధరలు తగ్గించండి': ట్రంప్ 
'మీకు ఇప్పటికే భారీ లాభాలు వచ్చాయి.. ఇక ధరలు తగ్గించండి': ట్రంప్

Trump: 'మీకు ఇప్పటికే భారీ లాభాలు వచ్చాయి.. ఇక ధరలు తగ్గించండి': ట్రంప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, ఆ తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చమురు ధరలు తగ్గినా పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయని పేర్కొంటూ,అమెరికాలోని ప్రధాన చమురు కంపెనీలు వెంటనే పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గించాలని ఆదేశించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో స్పందిస్తూ, చమురు కంపెనీలు ఇప్పటికే భారీ లాభాలు ఆర్జించాయని, ఇక ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందించే సమయం వచ్చిందని పేర్కొన్నారు. "చమురు దిగ్గజాలు ఇప్పటికే బోలెడు లాభాలు పొందాయి. పెట్రోల్ బంకుల్లో ఇంధన ధరలను వెంటనే తగ్గించండి" అంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.

వివరాలు 

83 డాలర్ల స్థాయికి ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర

ఇటీవల పశ్చిమాసియాలో ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరాలో ఏర్పడిన అంతరాయాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి.

ఈ పరిస్థితులతో అమెరికాకు చెందిన ఎక్సన్ మొబిల్, షెవ్రాన్ వంటి ప్రముఖ చమురు సంస్థలు గత త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి.

అయితే, ఇరాన్‌కు సంబంధించిన మిలిటరీ చర్యలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన అనంతరం గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ధరలు తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర సుమారు 83 డాలర్ల స్థాయికి చేరింది.

అయినప్పటికీ, ఆ తగ్గుదలను వినియోగదారులకు అందించకుండా చమురు కంపెనీలు అధిక లాభాలు పొందుతున్నాయని ట్రంప్ విమర్శించారు.

వివరాలు 

ప్రజలకు తక్కువ ఇంధన ధరల రూపంలో అందించడం చమురు సంస్థల బాధ్యత

ఈ సందర్భంగా షెవ్రాన్ సీఈఓ మైక్ విర్త్‌ను కూడా ట్రంప్ నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు.

తమ ప్రభుత్వ వ్యూహాలు, విధానాలు, మద్దతు కారణంగానే వెనిజువెలా వంటి ప్రాంతాల్లో షెవ్రాన్ తిరిగి బలమైన స్థానం సంపాదించి భారీ ఆదాయాలు పొందుతోందని, కానీ ఆ విషయాన్ని కంపెనీ యాజమాన్యం గుర్తించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం అందించిన స్థిరత్వం, విధానపరమైన సహకారం లేకపోయి ఉంటే అమెరికా చమురు పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేదని ట్రంప్ పేర్కొన్నారు.

ప్రభుత్వ విధానాల వల్ల లాభపడిన సంస్థలు, ఆ ప్రయోజనాన్ని ప్రజలకు తక్కువ ఇంధన ధరల రూపంలో అందించడం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

చమురు దిగ్గజాలపై ఒత్తిడి

ఇదిలా ఉండగా, అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో పెరుగుతున్న జీవన వ్యయం, అధిక ఇంధన ధరలు రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా కీలక సవాలుగా మారుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఓటర్ల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ చమురు దిగ్గజాలపై ఒత్తిడిని మరింత పెంచుతున్నారు.

అయితే, చమురు కంపెనీలు స్వచ్ఛందంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే, ధరల నిర్ణయ ప్రక్రియపై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ద్వారా విచారణ చేపట్టే అవకాశాన్ని కూడా వైట్‌హౌస్ పరిశీలించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT