LOADING...
Trump: డాలర్‌పై నమ్మకం కోల్పోకూడదంటే.. ఇరాన్ డబ్బు తిరిగి ఇవ్వాలి: ట్రంప్
డాలర్‌పై నమ్మకం కోల్పోకూడదంటే.. ఇరాన్ డబ్బు తిరిగి ఇవ్వాలి: ట్రంప్

Trump: డాలర్‌పై నమ్మకం కోల్పోకూడదంటే.. ఇరాన్ డబ్బు తిరిగి ఇవ్వాలి: ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన ఆస్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నిధులను శాశ్వతంగా నిలిపివేయడం అమెరికా డాలర్‌పై ప్రపంచదేశాల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.."ఇరాన్‌కు చెందిన భారీ మొత్తంలో నిధులను అమెరికా నిలిపివేసింది. అయితే అవి మన డబ్బు కాదు.. వాళ్ల సొమ్ము.ఒక దశలో వాటిని తిరిగి ఇవ్వాల్సి వస్తుంది.లేకపోతే భవిష్యత్తులో ఎవరూ అమెరికా డాలర్‌పై పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు" అని చెప్పారు. ఈ అంశంపై తాను కూడా చాలా ఆలోచించానని ట్రంప్ వెల్లడించారు. మొదట్లో ఆ డబ్బును తిరిగి ఇవ్వకపోతే బాగుంటుందని భావించినా,దీర్ఘకాలంలో అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు,డాలర్ విశ్వసనీయతకు నష్టం కలిగిస్తుందని అర్థమైందన్నారు.

వివరాలు 

మళ్లీ తెరుచుకోనున్న హర్ముజ్ జలసంధి

ప్రపంచంలోని అనేక దేశాలు తమ నిధులను డాలర్ రూపంలో నిల్వ ఉంచుతున్నాయని, అమెరికాతో చిన్నపాటి విభేదాలు వచ్చినా తమ సొమ్ము స్వాధీనం చేసుకుంటారనే భయం కలిగితే డాలర్‌కు ఆదరణ తగ్గే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, మధ్యప్రాచ్య యుద్ధానికి ముగింపు పలికేలా అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, రెండు దేశాల మధ్య ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ మూసివేసిన హోర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనుంది. అలాగే అక్కడ అమలు చేస్తున్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం నెలకొనే అవకాశాలు

ఈ పరిణామాల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై వెంటనే కనిపించింది. హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభం, ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు సడలించే అవకాశం ఉందనే అంచనాలతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 89 సెంట్లు తగ్గి 78.66 డాలర్లకు చేరగా, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర 98 సెంట్లు క్షీణించి 75.81 డాలర్ల వద్ద ట్రేడైంది. ప్రపంచ ఇంధన సరఫరాలో ఇటీవల కాలంలో ఏర్పడిన అతిపెద్ద అంతరాయాలకు ఈ ఒప్పందం ముగింపు పలికే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement