Trump: 'కేవలం రెండు నెలలే' యుద్ధం చేశాం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కేవలం రెండు నెలల పాటు మాత్రమే యుద్ధం సాగిందని ఆయన తెలిపారు. అమెరికా గతంలో చేసిన యుద్ధాలు 18 ఏళ్లు, నాలుగేళ్లు కొనసాగిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత యుద్ధంలో త్వరలోనే విజయం సాధిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై సైనిక చర్య తీసుకోకపోయి ఉంటే ప్రతికూల పరిస్థితులు తలెత్తేవని పేర్కొన్నారు. తన మొదటి పదవీకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, రెండోసారి పదవీకాలంలో దాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని చెప్పారు.
వివరాలు
ఈ వారాంతంలో తదుపరి చర్చలు
ఇరాన్‌లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. చమురు ధరలపై స్పందిస్తూ,రాబోయే వారం రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలని అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించాలా లేదా అన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. టెహ్రాన్ తమతో ఒప్పందానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆ దిశగా చర్చలు కొనసాగుతున్నాయని,చర్చల్లో పురోగతి సాధిస్తే కాల్పుల విరమణ పొడిగింపు అవసరం ఉండకపోవచ్చని అన్నారు. ఈ వారాంతంలో తదుపరి చర్చలు జరిగే అవకాశముందని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ సిద్ధపడిందని వెల్లడించారు. దీనిని కీలక ముందడుగుగా అభివర్ణించారు.
వివరాలు
10 యుద్ధాలు ఆపినట్లు ట్రంప్ వ్యాఖ్యలు
రాబోయే చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందాన్ని స్వయంగా ప్రకటించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా తాను 9 యుద్ధాలను ఆపానని, తాజాగా ఇది పదో యుద్ధమని పేర్కొన్నారు. దీనిని తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు.