Kash Patel: కాశ్ పటేల్,తులసి గబ్బార్డ్ సహా కీలక అధికారులకు ట్రంప్ ఉద్వాసన..?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనా వ్యవస్థలో కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులను పదవి నుంచి తప్పించే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్, అటార్నీ జనరల్ పామ్ బోండీని పదవుల నుంచి తొలగించిన నేపథ్యంలో ఈ చర్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉన్నకాశ్ పటేల్,అలాగే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌గా ఉన్న తులసి గబ్బార్డ్ పై కూడా వేటు పడే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జాబితాలో ఆర్మీ సెక్రటరీ డేనియల్ డ్రిస్కోల్, లేబర్ సెక్రటరీ లోరి చావెజ్ పేర్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.
వివరాలు
వ్యక్తిగత అంశాల కారణంగా వివాదాల్లో కాశ్ పటేల్
పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా కాశ్ పటేల్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యక్తిగత అంశాల కారణంగా ఆయన పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, ఇరాన్ అంశంపై వచ్చిన విమర్శలకు సమర్థంగా స్పందించడంలో తులసి గబ్బార్డ్ విఫలమయ్యారని ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ఇరాన్ తిరిగి అణు సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయలేదు: తులసి
ప్రభుత్వ వాదనలు,సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు గబ్బార్డ్ ఇచ్చిన వివరణల మధ్య విభేదాలు ఉండటం అధ్యక్షుడి ఆగ్రహానికి కారణమైందని తెలుస్తోంది. గత ఏడాది జూన్‌లో ఇరాన్‌లోని అణుశుద్ధి కేంద్రాలపై దాడులు జరిగిన తర్వాత, ఆ దేశం తిరిగి అణు సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయలేదని గబ్బార్డ్ ఇటీవల వెల్లడించారు. అయితే, ఇరాన్ అణు శక్తిని దెబ్బతీసే లక్ష్యంతోనే యుద్ధానికి దిగినట్టు ట్రంప్ ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.