'Trump Strait': హర్మూజ్ జలసంధికి 'ట్రంప్ స్ట్రెయిట్' పేరు.. ట్రంప్ సంచలన ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో కొనసాగుతూ.. యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధి పేరును 'ట్రంప్ స్ట్రెయిట్'గా మార్చాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో వెల్లడించారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మరోసారి చర్చకు దారితీశాయి.
వివరాలు
హర్మూజ్ జలసంధి అమెరికా నియంత్రణలో లేదు
"హర్మూజ్ జలసంధి ప్రస్తుతం అమెరికా నియంత్రణలోనే ఉంది కదా.. అలాంటప్పుడు దాని పేరును 'ట్రంప్ స్ట్రెయిట్'గా మార్చేద్దామా? అమెరికా మాదిరిగానే ఇది కూడా ఇంతకుముందెన్నడూ లేనంత 'హాటర్'గా ఉంటుంది" అంటూ ట్రంప్ తన పోస్టులో వ్యాఖ్యానించారు.
ఇటీవలి వారాల్లో ఈ కీలక జలమార్గంపై అమెరికాకే పూర్తి సార్వభౌమాధికారం ఉందంటూ ఆయన పలుమార్లు చెబుతున్నారు.
అంతేకాకుండా హర్మూజ్‌ను 'కొత్త అమెరికా భూభాగం'గా సూచిస్తూ ఓ మ్యాప్‌ను కూడా సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.
అయితే వాస్తవ పరిస్థితి ట్రంప్ చెబుతున్నదానికి భిన్నంగా ఉంది.
హర్మూజ్ జలసంధి అమెరికా నియంత్రణలో లేదు. ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడంతో.. అందుకు ప్రతీకార చర్యగా ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా మూసివేసింది.
వివరాలు
ఇరాన్ సముద్రంలో కొత్తగా మైన్‌లు ఏర్పాటు చేస్తోంది: అమెరికా
ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే సాగుతుంది.
దీంతో హర్మూజ్‌లో ఏర్పడే ఎలాంటి అంతరాయమైనా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. ఇరాన్ సముద్రంలో కొత్తగా మైన్‌లు ఏర్పాటు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం అమెరికా దళాలు హర్మూజ్ ప్రాంతంలో మరోసారి దాడులు ప్రారంభించాయి.
ఈ పరిణామాల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపైనా కనిపించింది. చమురు సరఫరాపై ఆందోళనలు పెరగడంతో ముడిచమురు ధరలు మరోసారి పైకి ఎగిశాయి.
భౌగోళిక ప్రాంతాల పేర్లను మార్చడం విషయంలో ట్రంప్‌కు ఇది కొత్తేమీ కాదు.
వివరాలు
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చే ఉత్తర్వులు
గత వారం కెనడాతో వాణిజ్య వివాదం కొనసాగుతున్న సమయంలో ఒంటారియో సరస్సు పేరును 'లేక్ అమెరికా'గా మార్చారు.
అంతకుముందు, 2025 జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చే ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రంప్‌కు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
80ఏళ్ల ఆయన తొలుత సరదాగా లేదా హాస్య ధోరణిలో ఇలాంటి ప్రతిపాదనలు చేసినప్పటికీ.. ఆ తర్వాత వాటిని ఆచరణలోకి తీసుకురావడం ఆయన రాజకీయ శైలిలో భాగంగా మారిందని చెబుతున్నారు.
ఇప్పుడు హర్మూజ్ జలసంధికి'ట్రంప్ స్ట్రెయిట్'అనే పేరు పెట్టాలన్న ప్రతిపాదన కూడా అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు,మరింత ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.