Gold Card: ట్రంప్ గోల్డ్ కార్డ్ స్కీమ్.. నాలుగు నెలల్లో ఒక్కరికే ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా పౌరసత్వం కోసం ఆసక్తి చూపుతున్న ధనికులకు ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ గతేడాది 'గోల్డ్ కార్డు' (Gold Card) పథకాన్ని ప్రకటించారు. డిసెంబర్‌లో ఈ స్కీమ్‌ను అధికారికంగా ప్రకటించగా, ఇప్పటివరకు కేవలం ఒక్కరికి మాత్రమే 1 మిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ కార్డు వీసాకు ఆమోదం లభించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. పథకం ప్రారంభించిన కొద్ది రోజులలోనే సుమారు 1.3 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ కార్డులను విక్రయించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఒక్కరికి మాత్రమే వీసా మంజూరు అయినప్పటికీ, వందలాది మంది దరఖాస్తులు సమర్పించగా, వాటి పరిశీలన కొనసాగుతోందని పేర్కొన్నారు.
వివరాలు
ఈ పథకం ద్వారా అమెరికాకు భారీ ఆదాయం
గోల్డ్ కార్డు పథకం ద్వారా అమెరికాకు భారీ ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతంలో వాణిజ్య శాఖ అంచనాల ప్రకారం, ఈ స్కీమ్ ద్వారా దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని, అది దేశ బడ్జెట్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు 1990లలో ప్రవేశపెట్టిన EB-5 వలస పెట్టుబడిదారుల కార్యక్రమంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టే లక్ష్యంతోనే గోల్డ్ కార్డు పథకాన్ని తీసుకువచ్చినట్లు ట్రంప్ గతంలో వివరించారు.